‘కరోనా’ కట్టడికి సర్కారు సన్నద్ధం

by Shyam |
‘కరోనా’ కట్టడికి సర్కారు సన్నద్ధం
X

కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచదేశాలు బెంబేలెత్తుతున్నాయి. చైనాలో ఇప్పటికి 900కి పైగా మందిని ఈ వైరస్ పొట్టనబెట్టుకుంది. ఈ వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం ఒకవైపు శాస్త్రజ్ఞుల పరిశోధనలు ముమ్మరంగా సాగుతుండగా మరోవైపు, ఇతర దేశాలు ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో తలమునకలయ్యాయి. మనదేశంలోకీ ఈ వైరస్ ప్రవేశించిన విషయం తెలిసిందే. కేరళకు చెందిన ముగ్గురికి ఈ వైరస్ సోకినట్టు ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు వైరస్‌పై నిఘా వేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంది. వేగంగా వ్యాపిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు, ప్రతి ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 25 పడకలను ఏర్పాట్లు జరిగాయి. ప్రతి జిల్లాలో వైరస్ అనుమానితులను పరిశీలనలో ఉంచేందుకు ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తూ ఈ వైరస్ అనుమానితులు కనిపించిన క్షణాల్లోనే స్పందించేందుకు ప్రత్యేకంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం(ఆర్ఆర్‌టీ)లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, అన్ని జిల్లాల్లో 24 గంటలు అందుబాటులో ఉండే ఆర్ఆర్‌టీలకు మూడు మెడికల్ కాలేజీలకు చెందిన ముగ్గురు నిపుణుల కమిటీ సపోర్ట్‌గా ఉంటుంది. వైరస్ అప్రమత్తతపై జిల్లా కలెక్టర్లకూ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రతి జిల్లాలో కరోనా వైరస్ కంట్రోల్ రూముల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ గదులు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. వైరస్ అనుమానితులను వేరుగా ఉంచి పరిశీలించేందుకు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 25 బెడ్లను ఏర్పాటు చేశారు. గతంలో హెచ్1ఎన్1 వైరస్ కోసం ఏర్పాటు చేసిన పడకలనే ఇప్పుడు కరోనా వైరస్ అనుమానితుల కోసం ఉపయోగించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారు ఇప్పటి వరకు చైనాకు వెళ్లొచ్చినవారే కావడం గమనార్హం. అందుకే చైనాకు వెళ్లొచ్చినవారిని అన్ని దేశాలు అబ్జర్వేషన్‌లో పెడుతున్నాయి. మన దేశంలోనూ ఇటువంటి జాగ్రత్తలు, పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ సోకిన కేరళవాసులు చైనా నుంచి తిరిగొస్తుండగా వారితోపాటు విమానంలో ప్రయాణించినవారి వివరాలపైనా దృష్టి సారించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలకు చెందిన వైద్యాధికారులతో కలిసి ఈ ప్రక్రియ చేపట్టింది. మొత్తం 11 రాష్ట్రాలకు చెందిన 76 మంది కరోనా సోకినవారితో విమానంలో ప్రయాణించినట్టు గుర్తించారు. కరోనా సోకినవారికి అతిసమీపంలో కూర్చున్నవారిని ప్రత్యేక గదుల్లో ఉంచి పరిశీలిస్తుండగా మిగితా ప్రయాణికులను అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలోనే జనవరి 15 తర్వాత చైనాలోని వుహాన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చినవారు.. కరోనా వైరస్ లక్షణాలున్నవారు వెంటనే 040-24651119 నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కోరారు.

Advertisement

Next Story

Most Viewed