‘ధరణి’ చూడని భూములతోనే ఇబ్బందులు..!

by Anukaran |
‘ధరణి’ చూడని భూములతోనే ఇబ్బందులు..!
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పుస్తకాల చట్టం-2020 చట్టం అమల్లోకి వచ్చేసింది. రికార్డులు సక్రమంగా ఉన్న రైతులకు ఎలాంటి ఢోకా లేదు. ఆటంకాల్లేకుండా అమ్ముకోవచ్చు. కొనుగోలుదార్లకు అవరోధాలు ఉండవు. ‘ధరణి’ పోర్టల్ చూడని భూములతోనే పంచాయితీలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూములకు ఆటో లాక్ వేసేశారు. అంతకు ముందే ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్‌లో నమోదు చేశారు. క్షేత్ర స్థాయిలో వక్ఫ్ భూములకు, రికార్డులకు పొంతనే లేదన్న వాదన వినిపిస్తోంది. లేని భూములు తమవేనంటూ వక్ఫ్ బోర్డు గెజిట్ పబ్లికేషన్ చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని రెవెన్యూ అధికారులే ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్నఅత్యంత ఖరీదైన భూములు వక్ఫ్ ప్రాపర్టీ అంటూ 1982 నుంచి 2013 వరకు గెజిట్ పబ్లికేషన్ చేశారు. నగరంలోని హకీంపేట భూములన్నీ హకీంబాబా దర్గాకు సంబంధించినవేనంటూ వక్ఫ్ బోర్డు ప్రకటించింది.

గెజిట్ పబ్లికేషన్ పైనే అనుమానాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులే కోర్టుకెక్కిన ఉదంతాలు ఉన్నాయి. వక్ఫ్, భూదాన్, దేవాదాయ భూముల లావాదేవీల నిలిపివేతతో వేలాది మంది అయోమయంలో పడ్డారు. దశాబ్దాలుగా సాగు చేస్తోన్న రైతాంగానికి సర్వే పూర్తయ్యే వరకు పట్టాదారు పుస్తకాలు వచ్చే అవకాశం లేకుండా చేశారు. పది రోజుల క్రితం కూడా హైదరాబాద్, పరిసరాల్లోని ఎనిమీ ప్రాపర్టీలను పరిశీలించేందుకు కేంద్ర బృందమొకటి వచ్చి వెళ్లింది. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలైన రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, బాలానగర్‌, మహేశ్వరం మండలాల్లోని ఎవాక్యూ, ఎనిమీ ప్రాపర్టీలకు యజమానులు పుట్టుకొచ్చారు. 1948-52 వరకు రూపొందించిన బేసిక్‌ ప్రాపర్టీ రిజిస్టర్లనూ మాయం చేసి ఏ భూములు ఎవాక్యూ పరిధిలోకి వస్తాయో తెలియకుండా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి వాటిపైనా లెక్క తేల్చకుండానే ‘ధరణి’ని ప్రామాణికంగా చేయడంతో మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఓ ఆర్డీఓ స్పష్టం చేశారు.

వివాదాలతో అన్యాయం..

చాలా మంది రైతులకు భూమి వారసత్వంగానే వచ్చింది. ‘ధరణి’ ప్రామాణికం కావడంతో వారు భూమి హక్కులు పొందే అవకాశం దూరమైంది. ఆ భూములు ఎక్కడున్నాయో, వాటి హద్దులేవో ఆయా శాఖల అధికారులకు, సిబ్బందికి తెలియదు. గుండుగుత్తగా ఫలానా సర్వే నంబరులో అని పేర్కొన్నారు. దాంతో సదరు సర్వే నంబరులోని మిగతా రైతులందరికీ పాస్ పుస్తకాల జారీని నిలిపివేశారు. ఈ వివాదాలు తేల్చేందుకు సమగ్ర సర్వే పూర్తయ్యే వరకు ఆగాల్సిందేనని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

లేని పంచాయితీ పెట్టి..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 280.37 ఎకరాల భూమి తమదేనంటూ ముస్లిం మెటర్నిటీ ఆస్పత్రి యాజమాన్యం, వక్ఫ్‌ బోర్డు, 194 మంది గిరిజనులు పోరాడుతున్నారు. ఖాతా నం.623లో 21 సర్వే నంబర్లలో ఈ భూమి ఉంది. పట్టాదారు కాలమ్‌లో మెటర్నిటీ ఆస్పత్రి ఉండగా, అనుభవదారు కాలమ్‌లో రైతులు ఉండడం గమనార్హం. సదరు భూమి తమదంటూ వక్ఫ్‌ బోర్డు కూడా చెబుతోంది. మెటర్నిటీ ఆస్పత్రి పేరిట ఉన్న భూమికి 194 మంది అనుభవదారులు ఉన్నారు.

దాదాపు అందరూ ఎస్టీలే కావడం గమనార్హం. దయ్యాలగుండు తండా, ఎన్‌డీ తండాలు కూడా ఉన్నాయి. సుమారు 100కు పైగా ఇండ్లు ఉన్నాయి. తాతల కాలం నుంచి కబ్జాలో ఉంటున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. వ్యవసాయ భూముల్లో 14 బోర్లు కూడా ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట రెవెన్యూ డివిజన్ లోని ఆరు గ్రామాలన్నీ వక్ఫ్ భూములుగా గెజిట్ పబ్లికేషన్ చేశారు. ఆ గ్రామాల్లోని రైతులకు అనాదిగా పట్టా పాసుపుస్తకాలు ఉన్నాయి. రికార్డుల్లోనూ ఉన్నారు. ఇలా అనేక చిక్కుముళ్లు ‘ధరణి’ ముందు ఉన్నాయని ఓ డిప్యూటీ కలెక్టర్ ‘దిశ’కు వివరించారు.

లెక్క తేల్చాల్సినవి..

మియాపూర్‌ సర్వే నం.20లో 252 ఎకరాలు, 28లో 384 ఎకరాలు వంతున ఎనిమీ ప్రాపర్టీ ఉంది. వీటిలో హుడా, హెచ్‌ఎంఆర్‌కు కొంత ఇచ్చారు. సర్వే నం.20లో 100 ఎకరాల వరకు గుట్ట రూపంలో ఖాళీగా ఉంది. సుభాష్‌నగర్‌, నడిగడ్డతండా, న్యూకాలనీలు వెలిశాయి. షేక్ పేటలో సర్వే నం.403లో డీజేహెచ్‌ఎం ప్లాట్‌ నం.24 బంజారాహిల్స్‌ రోడ్డు నం.10లో 4 ఎకరాలు, బంజారాహిల్స్‌ నం.3లో ప్లాట్‌ నం.55లో 3 ఎకరాలు, తహసీల్దార్‌ కార్యాలయం వెనుక సర్వే నం.129/67లో 3 ఎకరాలు, దాని పక్కనే మరో 2.38 ఎకరాలు, డీజెహెచ్‌ఎం ప్లాట్‌ నం.8 డీలో 3,500 చ.గ.ల వంతున ఎవాక్యూ ప్రాపర్టీలు ఉన్నాయి.

ఓల్డ్‌బోయినపల్లిలో పాత సర్వే నంబర్లు 1, 41, 44, 45, 46, 50, 85, 86, 84, 87, 88, 89, 90, 92, 93, 94, 64, 62, 52/7, 52/5, 55/1 ల్లో సుమారు 50 ఎకరాల వరకు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. శంషాబాద్ మండలం పెద్దషాపూర్, కొత్వాల్‌గూడ, పెద్ద‌ గోల్కొండ, బహదూర్ గూడల్లోనూ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోనూ వేలాది మంది రైతులకు రికార్డుల ప్రక్షాళనలో పాసు పుస్తకాలు ఇవ్వలేదు.

Advertisement

Next Story

Most Viewed