సర్కార్ ప్లాన్ ఫెయిల్.. హిమాచల్ ప్రదేశ్‌‌‌ను ఆదర్శంగా తీసుకోవాలని డిమాండ్

by Anukaran |   ( Updated:2023-06-13 16:42:51.0  )
సర్కార్ ప్లాన్ ఫెయిల్.. హిమాచల్ ప్రదేశ్‌‌‌ను ఆదర్శంగా తీసుకోవాలని డిమాండ్
X

దిశ, ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో వాణిజ్య పంటలు సాగు చేసేందుకు అలవాటు పడిన రైతులు కోతుల దెబ్బకు క్రాప్ మార్చుకుంటున్నారు. బతుకుజీవుడా అంటూ వరిపంటలు వేసుకున్నారు. ‘కోతులు పోవాలి.. వానలు వాపసు రావాలి’ అన్న సర్కార్ సూత్రం రివర్సయింది. లానినో ప్రభావంతో వర్షాలు అంతటా విస్తారంగా కురిసినా, కోతులు వాపసు పోవటంలేదు. పైగా జనావాసాల్లోనే తిష్టవేసి పంటచేలలోనే తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి. కూడునిచ్చే పంటలనే కాదు గూడు నిచ్చే ఇండ్లు పీకి పందిరేస్తున్నాయి. ఆరు నెలల కిందట నిర్మల్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రజలు నాలుగు వైపుల నుంచి వందలాది కోతుల మందలను కర్రలతో తరమగా కొన్ని గోదావరి నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయాయి.

నిర్మల్​జిల్లా మామడ మండలం కమల్​కోర్​సరిహద్దు ప్రాంతం గుమ్మిర్యాల. అక్కడ రైతులు చాలా చైతన్యవంతులు. అధిక శాతం రైతులు సంప్రదాయ పంటలను పట్టుకుని వేలాడుతున్న సమయంలో అక్కడి ప్రజలు వేరుశనగ, కంది, పెసర్లు, పసుపు, మొక్కజొన్న వంటి వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటలు వేసి లాభాలు గడించారు. అది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారింది. కోతుల మూకలు ఊళ్లపై పడ్డాయి. పంటలను ఆహారంగా ఎంచుకున్నాయి. వాటిని తరమ లేక.. పంటలకు రక్షణ లేక రైతులు విలవిలలాడి పోయారు. సర్కారు మొర ఆలకించపోవడంతో వాణిజ్య పంటల సాగుకు స్వస్తి పలికారు. చాలా కాలంగా వరి సాగు చేస్తున్నారు. తమ గ్రామాలలో కోతుల సమస్య వల్ల పంటలే కాదు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయని ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు టీఆర్ఎస్​కొత్తగా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.

మారని తీరు..

హరితహారంలో భాగంగా నాటిని మొక్కలు ఎదిగినా.. అలంకృత మొక్కలు పెరిగినా, అవి అడవులకు ప్రత్యామ్నాయం కాలేకపోయాయి. కోతులు వాపసు పోకపోగా వాటి సంతానాన్ని మరింత పెంచుకుని గ్రామాలపై, పట్టణాలపై విరుచుకుపడుతున్నాయి. రెండు దశాబ్దాలుగా తీవ్రమవుతున్న ఈ సమస్యకు ప్రభుత్వం శాస్త్రీయపరంగా శాశ్వత పరిష్కారం చూపలేకపోయింది. సంతాన నియంత్రణ ఆపరేషన్‌లను ముమ్మరం చేయలేదు. నిర్మల్‌లో మంకీ రిహాబిలిటేషన్ సెంటర్‌ను ఎట్టకేలకు ఇటీవల ప్రారంభించినా అది పూర్తి స్థాయిలో పనిచేయడంలేదనే విమర్శలున్నాయి.

రాత్రి పూట అడవి పందులు పగలంతా కోతులు ఇలా కాపలా కాయ లేక, వాటిని తరమలేక రైతులు అనేక బాధలు పడుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, భూపాలపల్లి, జగిత్యాల, నిజామాబాద్‌తో పాటు నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలలో కూడా వానర దాడుల సమస్య తీవ్రంగా ఉంది. గతంలో గ్రామాల్లోని రైతులంతా కలిసి తలా కొన్ని డబ్బులు వేసుకుని కొండెంగలు(కొండముచ్చులు) తెప్పించ్చుకున్నారు. కోతుల్ని పట్టే వాళ్లను రంగంలోకి దించారు. కానీ ఫలితం శూన్యం. గతంలో కోతులను పట్టి ఔషధ కంపెనీలకు అమ్ముకునే వారు. ఇందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థే ఉండేది. ఊరికి కనీసం ఒక మంకీ క్యాచర్​ఫ్యామిలీ ఉండేది. కోతులను పట్టి విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల వాటి సంతతి బాగా తగ్గి అరుదైన వన్యప్రాణిగా మారింది.

దీంతో పర్యావరణ వేత్తలు ఉద్యమించారు. ఈ క్రమంలో 1977లో వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కోతులను పట్టడం, చంపడం, ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. దీంతో కోతులు పట్టే వారు కరువయ్యారు. ఇప్పుడు మంకీ క్యాచర్స్​కావాలంటూ ప్రకటనలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. కోతులను పట్టాలన్నా.. వాటిని పరిశోధనాశాలలో ఉపయోగించాలన్నా వన్యప్రాణి సంరక్షణ చట్టం14–ఏ కింద ఇండియన్ కౌన్సిల్​ఆప్ మెడికల్ రీసెర్చ్ అనుమతి తప్పనిసరి.

ప్రత్యామ్నాయం వేస్తే..

వరి కాకుండా అపరాలు, వేరుశనగా, చెరుకు, మొక్కజొన్న తదితర పంటలు వేస్తే వాటి సంరక్షణకు అనేక తిప్పలు పడాల్సి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోతులు రాకుండా కాపలా కాయాల్సిన పరిస్థితి ఉంటుంది. రాత్రి వేళ అడవి పందులు రాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉన్నది. అపరాలు, వేరుశనగ, ఇతర ఆరుతడి పంటలు సాగు చేయడం ద్వారా పంటంతా కోతుల పాలు కావడం ఖాయమని చెబుతున్నారు. రాష్ట్రంలో కోతులతో పాటు అడవి పందుల సమస్య తీవ్రంగానే ఉంది. మూడేండ్ల కిందట తెలంగాణ అటవీశాఖ కొన్ని షరతులతో అడవి పందులను కాల్చిచంపడానికి అనుమతినిచ్చింది.

కేవలం పంట పొలాలలో ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన షూటర్‌లే వాటిని చంపాలి. గర్భంతో ఉన్న పందిని, చిన్నపిల్లలను చంపడానికి వీలు లేదు. దీనికి కూడా రైతులు ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. కానీ, హిమాచల్ ప్రదేశ్​లాగా మన రాష్ట్రంలో కూడా కోతులను చంపడానికి అనుమతి నివ్వాలనే డిమాండ్​ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో రీసెస్​మకాక్ రకం కోతులను ఎందుకు పనికి రాని ఎలుక లాంటి ప్రాణి ‘‘వర్మిన్​”గా ప్రకటించి నాలుగేండ్లుగా చంపడానికి పర్మిషన్​ ఇచ్చింది. దీంతో పాటు కోతుల సంతాన నియంత్రణకు విరివిగా స్టెరిలైజేషన్​సెంటర్‌లను ఏర్పాటు చేసింది. కోతుల సంతాన నియంత్రణ ఆ రాష్ట్రంలో విజయవంతమైంది. మన రాష్ట్రంలో కూడా కోతులను పట్టి సంతాన నియంత్రణ ఆపరేషన్​చేయాలని, వాటిని అడవులలో వదలడానికి సర్కార్ ప్రత్యేక యంత్రాంగాన్ని, వసతులను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

సాగు చట్టాల రద్దు కేసీఆర్ కు ముందే లీక్ అయ్యిందా.?పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story