అప్పటివరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు : గాలి అనిల్ కుమార్

by Shyam |
Congress leader gaali anil kumar
X

దిశ, పటాన్‌చెరు: పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజలు పరేషాన్ అవుతున్నారని, వెంటనే ధరలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇంచార్జి గాలి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం పెట్రోల్ ధరలకు నిరసిస్తూ సంగారెడ్డిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో పార్టీ రాష్ట్ర నేతలు నిరంజన్ రెడ్డి, జెట్టి కుసుమ కుమార్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్‌లు పాల్గొన్నారు. అంతకముందు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి నేతృత్వంలో ఎడ్లబండ్ల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గాలి అనిల్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణలో పూర్తిగా విఫలం చెందాయని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. ధరలను పెంచుతూ అటు ప్రధాని మోడీ, ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల జేబులు లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓవైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మరో వైపు పెట్రోల్, డీజిల్, నూనెలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతుండడంతో ప్రజలు ఆర్థికంగా చితికి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో లీటర్ 60 రూపాయలు పెట్రోల్ ధర ఉండగా, నేడు బీజేపీ ప్రభుత్వంలో రూ.104 కు చేరిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. పెరిగిన పెట్రో, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ధరలను తగ్గించే వరకు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed