కేసీఆర్ బర్త్‌డే రోజు కేకులు కోసినంత ఈజీగా పీకలు కోశారు

by Anukaran |   ( Updated:2021-02-21 02:28:37.0  )
కేసీఆర్ బర్త్‌డే రోజు కేకులు కోసినంత ఈజీగా పీకలు కోశారు
X

దిశ,వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో కేకులు కోసినంత ఈజీగా న్యాయవాద దంపతుల పీకలు కోసి హతమార్చడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హత్యకు స్కెచ్ వేసిన నిందితులు

పట్టపగలు మంథని – పెద్దపల్లి మెయిన్ రోడ్ పై వెహికల్స్ తో అడ్డుకొని కత్తులతో విచక్షణా రహితంగా హైకోర్ట్ లాయర్లు వామన్ రావు ఆయన భార్య నాగమణిలను దుండగులు దారుణంగా హత మార్చారు. ఇప్పుడీ హత్య రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వామన్ రావు తండ్రి కిషన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు కీలక నిందితులు కుంటా శ్రీనివాస్, కుమార్, చిరంజీవిని తెలంగాణ- మహరాష్ట్ర సరిహద్దులో అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అనంతరం వామన్ రావును కారులో వెంబడించి కుమార్ రెక్కీ నిర్వహిస్తే వామన్ రావు ఆయన భార్య నాగమణిలను మిగిలిన ఇద్దరు నిందితులు చంపినట్లు వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు హత్య వెనుక ఉన్న సూత్రదారులెవరూ? పాత్రదారులెవరూ? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో తేలిన అంశాలను బట్టి మరిన్ని అరెస్ట్ లు ఉంటాయని పోలీసులు హింట్ ఇచ్చారు.

సుమోటోగా స్వీకరించిన హైకోర్ట్

సంచలనం రేపిన వామన్ రావు దంపతుల హత్యకేసును హైకోర్ట్ సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో నిందితుల అరెస్ట్ తెరపైకి వచ్చింది. ఆ వెనువెంటనే మంథని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఏ1 శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇటు వామన్ రావు దంపతుల హత్యకేసును హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఘటనపై విచారణ జరిపి మార్చి 10లోగా నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.

వామన్ రావు హత్యలకు కారణాలేంటి?

గ్రామంలో వామన్ రావు ఇంటి పక్కనే ఉన్న శివాలయం కమిటీ, కుంటా శ్రీనివాస్ అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్లు, పెద్దమ్మతల్లి ఆలయ వివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. కుంటా శ్రీనివాస్ అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లో ఇళ్లను నిర్మించడంపై వామన్ రావు దంపతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు కోర్ట్ లో పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు పలు అంశాలపై పోరాడుతున్నారు. దీంతో గ్రామంలో కక్షలు పెరిగాయి. వీళ్లను అడ్డుతొలగించుకోవడం మేలనే నిర్ణయానికి వచ్చి నిందితులు ఈ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ బర్త్‌డే రోజు కేకులు కోసినంత ఈజీనా పీకలు కోయడం

మరోవైపు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదుల స్వగ్రామమైన మంథని మండలం గుంజపడుగులో మృతుల కుటుంబ సభ్యులను వీహెచ్ పరామర్శించారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో కేకులు కోసినంత ఈజీగా న్యాయవాద దంపతుల పీకలు కోసి హతమార్చడం దారుణమని అన్నారు. న్యాయవాదుల హత్య సీఎం కేసీఆర్ పుట్టిన రోజే జరిగాయని, దీంతో ప్రతీ ఏడాది కేసీఆర్ పుట్టిన రోజున వామన్ రావు, నాగమణి దంపతుల హత్య గురించే ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటారని మండిపడ్డారు. హత్యలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా.., నిందితుల జాబితాలో ఎందుకు చేర్చడం లేదన్నారు. అనంతరం హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి దారుణం గురించి స్థానిక నాయకుల్ని అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతురావు.

Advertisement

Next Story