ఏపీ సర్కార్‌పై కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

by Shyam |
ఏపీ సర్కార్‌పై కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కృష్ణానది యాజమాన్య బోర్డును విశాఖపట్నం తరలించవద్దని, విజయవాడ లేదా కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాంతంలో నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణాబోర్డును ఏపీకి తరలించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే విశాఖపట్నం తరలించడంలో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయని, దూరభారంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయని ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్‌రావు ఈనెల 15న కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును విశాఖపట్నంకు తరలించాలనుకుంటున్నట్లు గత నెల 25వ తేదీన రాసిన లేఖలో పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయని మురళీధర్‌రావు ఆ లేఖలో పేర్కొన్నారు.

కృష్ణాబోర్డు హెడ్ క్వార్టర్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తరలించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నదని, అప్పటి కేంద్ర జలవనరుల శాఖ సైతం కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు 2018 జూన్‌లో లేఖ రాసి విజయవాడలో సరైన భవనాలను చూసి తరలించాల్సిందిగా సూచించిందని మురళీధర్‌రావు గుర్తుచేశారు. కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో సైతం 2019 అక్టోబరు 9వ తేదీన కృష్ణా బోర్డు హెడ్‌క్వార్టర్‌ తరలింపు విషయమై చర్చ జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా సమ్మతి తెలియజేసిందని, హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఆ తర్వాత గతేడాది జనవరి 21న జలశక్తి మంత్రిత్వశాఖ నిర్వహించిన సమావేశంలోనూ ఇదే అంశంపై చర్చ జరిగిందని ఉదహరించారు.

కృష్ణాబోర్డు 12వ సమావేశంలో సైతం హెడ్ క్వార్టర్‌ను హైదరాబాద్ నుంచి తరలించడంపై చర్చ జరిగిందని, కానీ విశాఖపట్నంకు తరలించడంపై ఎలాంటి ప్రస్తావన రాలేదని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం సైతం ఇప్పటివరకు తెలంగాణకు అధికారికంగా విశాఖపట్నంకు తరలించే ప్రతిపాదన గురించి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. గతేడాది అక్టోబరు 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డు తరలింపు ప్ర్తతిపాదన చేసినప్పుడు తెలంగాణ ఆమోదం తెలిపిందని, కానీ విశాఖపట్నానికి తరలుతుందనే అభిప్రాయం మాత్రం లేదని పేర్కొన్నారు. పత్రికల్లో వార్తలు వచ్చేంతవరకు విశాఖపట్నానికి తరలిస్తున్నట్లు ఎలాంటి ప్రస్తావనా లేదని నొక్కిచెప్పారు.

విశాఖకు తరలించడంలో ఇబ్బందులు ఇవీ :
కృష్ణా బోర్డు హెడ్‌క్వార్టర్‌ను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించడానికి తెలంగాణకు ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ విశాఖపట్నానికి తరలించడంలో మాత్రం కొన్ని ఆచరణాత్మక ఇబ్బందులు ఉన్నాయని మురళీధర్‌రావు ఆ లేఖలో పేర్కొన్నారు. తాజాగా రాసిన లేఖలో ఆయన ప్రస్తావించిన కొన్ని అంశాలు :

• విశాఖపట్నం నగరం కృష్ణా బేసిన్ పరిధిలో లేదు. విజయవాడకు సుమారు 350 కి.మీ. దూరంలో ఉంది. గోదావరి బేసిన్ సహా కొన్ని నదుల బేసిన్‌లకు అవతల విశాఖపట్నం ఉంటుంది. హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే సుమారు 618 కి.మీ. దూరం అవుతుంది.

• కృష్ణా బోర్డు నిర్వహించే రెగ్యులర్ సమావేశాలతో పాటు త్రిసభ్య కమిటీ సమావేశాలు, చెన్నయ్ నగరానికి త్రాగునీరు అందించే అంశం, కొన్ని వివాదాల పరిష్కారానికి ఏర్పాటయ్యే సమావేశాల లాంటివి నిర్వహించాల్సి వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి సాగునీటిపారుదల శాఖ అధికరులు విశాఖపట్నానికి వెళ్ళాల్సి ఉంటుంది.

•ప్రయాణానికి ఖర్చులతో పాటు సమయం కూడా పడుతుంది. అధికారులకు బస సౌకర్యంలో సమస్యలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో క్రిందిస్థాయి సిబ్బంది కూడా సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. వారికి విమాన ప్రయాణానికి నిబంధనలు ఒప్పుకోవు కాబట్టి ఒక రోజు ముందుగానే రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది.

• కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ (బ్రిజేశ్ కుమార్) విచారణ తుది దశలో ఉందని, కానీ కృష్ణా బోర్డే హెడ్ క్వార్టర్ విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని, రీజినల్, సబ్ రీజినల్ కార్యాలయాలు ఎక్కడ నెలకొల్పాలనే అంశంపైనా నిర్ణయంతీసుకుంటుందని పేర్కొంది.

• ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా బోర్డును విశాఖపట్నానికి తరలించాలన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. కృష్ణా పరివాహక ప్రాంతంలోనే బోర్డు ప్రధాన కార్యాలయం నెలకొల్పాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బోర్డును తరలించకపోవడమే మంచిది.

Advertisement

Next Story