ఎముకలు, పువ్వులతో వజ్రం తయారు.. దాని ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..

by Disha Web Desk 20 |
ఎముకలు, పువ్వులతో వజ్రం తయారు.. దాని ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ పరంగా చైనా ఎంత ముందుందో మనందరికీ తెలిసిందే. ఈ దేశంలో చిన్న చిప్‌ల నుండి మొదలుకుని పెద్ద రోబోల వరకు ప్రతిదీ తయారు చేస్తారు. అలాంటి వాటిని మాత్రమే కాదు ఇక్కడి శాస్త్రవేత్తలు మరిన్ని అద్భుతమైన వస్తువులను కూడా అందంగా సృష్టిస్తారు. ప్రస్తుతం అలాంటి ఒక అద్భుతాన్నే సృష్టించారు. దాన్ని చూసినవారంతా ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ అందరినీ అబ్బుర పరిచే వస్తువేంటో దాని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా రెడ్ పియోనీల నుంచి వచ్చిన కార్బన్ మూలకాల నుండి 3-క్యారెట్ల వజ్రాన్ని సృష్టించారు. పియోని అనేది ఒక పుష్పం. ఇది ఆసియా యూరప్, పశ్చిమ ఉత్తర అమెరికా వరకు కనిపిస్తుంది. ఈ పువ్వును 'క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్' అని కూడా పిలుస్తారు. కొంతమంది దీనిని శృంగారానికి చిహ్నంగా కూడా భావిస్తారు. ఈ పువ్వు అనేక రంగులలో వికసిస్తుంది. ఇందులో గులాబీ, ఎరుపు, పసుపు, తెలుపు, ఊదా, నీలం ఉన్నాయి. పియోని పువ్వును ఉపయోగించి వజ్రాన్ని తయారు చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని చైనా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ప్రత్యేకమైన వజ్రం తయారు..

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని లుయోయాంగ్‌లో పియోని నుండి లభించిన కార్బన్ మూలకాలతో తయారు చేసిన ఈ వజ్రం ప్రపంచంలోని మొట్టమొదటిది. ఇటీవలి కాలంలో ఈ వజ్రాన్ని ఆవిష్కరించారు. సింథటిక్ డైమండ్ తయారీ సంస్థ లుయోయాంగ్ టైమ్ ప్రామిస్ దీనిని లుయాంగ్ నేషనల్ పియోనీ గార్డెన్‌కు విరాళంగా అందించింది. గత నెలలో పియోనీ గార్డెన్ డైమండ్ కంపెనీ ప్రత్యేకమైన వజ్రాన్ని తయారు చేయడానికి అవసరమైన పయోనీలను సరఫరా చేసింది. ఇందులో దాదాపు 50 ఏళ్ల పయోనీ కూడా ఉందని నివేదికలు చెబుతున్నాయి.

డైమండ్ ధర..

ఈ విశిష్ట వజ్రం ధర 3 లక్షల యువాన్లు అంటే 35 లక్షల రూపాయల కంటే ఎక్కువ అని లుయోయాంగ్ టైమ్ ప్రామిస్ కంపెనీ సీఈవో వాంగ్ జింగ్ తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, పీడనం వద్ద బయోజెనిక్‌ కార్బన్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ టెక్నాలజీని ఉపయోగించి ఈ వజ్రాన్ని తయారు చేశామని ఆయన చెప్పారు. అయితే పియోనీల నుండి లభించే కార్బన్ మూలకాలను వజ్రాలుగా మార్చడానికి ఉపయోగించే సాంకేతికత చాలా క్లిష్టమైనదన్నారు. వెంట్రుకలు, ఎముకలు, పువ్వుల నుండి కార్బన్ మూలకాలను ప్రత్యేకంగా రూపొందించిన పరికరంలో వెలికితీసి, ఆ మూలకాలను డైమండ్ నిర్మాణంలో కలిపారని కంపెనీ వెల్లడించింది. ఈ విధంగా ఈ ప్రత్యేకమైన వజ్రం సిద్ధమైందన్నారు.

Next Story

Most Viewed