ఛీ.. ఆఖరికి ఖాళీ సంచులను కూడా వదలట్లేదు: అచ్చెన్నాయుడు

by srinivas |
Acchennayudu125
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిస్తే.. ప్రస్తుతం డీలర్లను కేవలం స్టాకిస్టులా పేర్కొంటూ నామమాత్రం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..‘టీడీపీ హయాంలో రేషన్ డీలర్లకు గౌరవ వేతనం అందించాం. గోనె సంచుల్ని అమ్ముకుని కొంత ఆదాయం పొందేలా వెసులుబాటు కల్పించాం. ప్రస్తుతం వాటిని కూడా ప్రభుత్వానికి అందించాలంటూ జీవో ఇచ్చి డీలర్లపై పెత్తనం చేస్తున్నారు. గతంలో అందే సదుపాయాలన్నింటినీ రద్దు చేయడమే కాకుండా.. వలంటీర్లు, మొబైల్ వాహనాల పేరుతో డీలర్లను డమ్మీలుగా చేశారు. మరోవైపు కరోనా సమయంలో పంపిణీ చేసిన ఉచిత రేషన్ సరుకులకు సంబంధించిన కమీషన్ కూడా ఇవ్వలేదు. కరోనా ఉధృతంగా విజృంభించిన సమయంలోనూ పేదలకు రేషన్ సరుకులు అందించిన వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని ఎన్ని వినతులిచ్చినా ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 54 మంది డీలర్లు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతే.. కనీస పరిహారం కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పదుల సంఖ్యలో సరుకుల్ని అందించి.. పేదలకు అండగా నిలిచింది. కానీ నేడు రేషన్ షాపు కంటే బహిరంగ మార్కెట్ ఉత్తమం అనే పరిస్థితి తీసుకొచ్చారు. డీలర్ల సంక్షేమాన్ని సమర్ధంగా అమలు చేసి, రేషన్ వ్యవస్థను పటిష్టం చేస్తే.. జగన్ రెడ్డి రేషన్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి. డీలర్లు చేసే నిరసన కార్యక్రమాలతోపాటు.. భవిష్యత్తులో చేసే పోరాటాలకు టీడీపీ అండగా నిలుస్తుంది’ అని అచ్చెన్నాయుడు ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

Next Story