లెక్కలు తీయండి.. ఎవరీ లంకారెడ్డి : దేవినేని ఉమ

by srinivas |
లెక్కలు తీయండి.. ఎవరీ లంకారెడ్డి : దేవినేని ఉమ
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో అక్రమ మద్యం ఏరులైపారుతోందని అన్నారు. అక్రమ మద్యం, కాపు సారా ఏరులైపారుతుందని వైఎస్సార్సీపీ నేతలే చెబుతున్నారన్నారు. రూ.30 వేల కోట్ల అదనపు ఆదాయం కోసం మీ ప్రభుత్వం తెచ్చిన అధిక ధరల నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యం క్షీణించి, ప్రాణాలు పోతుంటే ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి జగన్ గారూ అంటూ అడిగారు. ఏపీలో పెరిగిన మద్యం ధరల నేపథ్యంలో స్పిరిట్, శానిటైజర్లు తాగి రెండ్రోజుల్లో ఏడుగురి ప్రాణాలు పోయాయని ఆరోపించారు. కాగా, అధిక మత్తు, కిక్కు కోసం మిథైల్‌ ఆల్కహాల్‌ వంటి విషపూరిత రసాయనాలు, శానిటైజర్లు తాగి విశాఖలో ఐదుగురు, కడప జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఇక అభివృద్ధి విషయానికి వస్తే.. టీడీపీ హయాంలో పోలవరం పనుల్లో జరిగిన పురోగతిని తాము చేసినట్టుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ వ్యాఖ్యలపై మండిపడుతూ, పోలవరం ప్రాజెక్టులో మీ కక్కుర్తి ఏంటని నిలదీశారు. దమ్ముంటే పోలవరం పనులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. తాను 75 సార్లు పోలవరం వెళ్లానని, చంద్రబాబు నాయుడు 26 సార్లు పోలవరం వెళ్లారని, సుమారు 105 వారాల పాటు ప్రతి సోమవారం పోలవరం పనులు చూశామని ఆయన చెప్పారు.

వైఎస్సార్సీపీకి దమ్ము, ధైర్యం ఉంటే ప్రాజెక్టుల సమాచారం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో పులిచింతలలో తమ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో లెక్కలు బయటికి తీసి చెప్పాలని సూచించారు. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అని చెప్పి నామినేషన్ పద్ధతిలో సొంత కాంట్రాక్టర్లకు వెలుగొండ టన్నెల్ పనులు ఇస్తారా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ లంకారెడ్డి ఎవరు? అని ఆయన ప్రశ్నిస్తూ, లంకారెడ్డి మీకు బంధువా? మిత్రుడా? చెప్పండి జగన్ గారూ అని అడిగారు. ప్రాజెక్టులపై న్యాయపరమైన పర్యవేక్షణ ఉంటుందని చెప్పి మీరేం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించడమే రివర్స్ టెండరింగా? మీ కడప జిల్లావాడని ఇచ్చారా? లేక, లంకారెడ్డి అని ఇచ్చారా? లేక, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో పనులు చేశాడని ఇచ్చారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Advertisement

Next Story