మున్సిపోల్స్: టీడీపీతో జనసేన పొత్తు

by Ramesh Goud |   ( Updated:2021-03-05 06:55:59.0  )
మున్సిపోల్స్: టీడీపీతో జనసేన పొత్తు
X

దిశ వెబ్‌డెస్క్:రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ రోజు ఒక పార్టీతో, రేపు మరో పార్టీతో పొత్తు పెట్టుకోవడం రాజకీయాల్లో సర్వసాధారణమే. అందుకే రాజకీయాల్లో ఏం జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఏపీ రాజకీయాల్లో అయితే పార్టీల మధ్య పొత్తులు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. ప్రతి ఎన్నికల్లో ఏవైనా రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేస్తాయి.

2014 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకోగా.. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో జనసేన పొత్తు పెట్టుకుంది. ఇక 2019 ఎన్నికల తర్వాత ఇప్పుడు బీజేపీతో జనసేన కలిసింది. అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ పొత్తుల రాజకీయంగా తెరపైకి వచ్చింది. ఏపీలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.

మరికొద్దిరోజులు మాత్రమే పోలింగ్‌కు సమయం ఉండటంతో పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే మున్సిపల్ఎ న్నికల్లో కొన్నిచోట్ల టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని వార్డులను పంచుకుంటున్నాయి. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. టీడీపీతో కలిసి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలాచోట్ల టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి.

ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, నర్సాపురంలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. టీడీపీ, జనసేన నేతలు కలిసి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తుపై మాత్రం బీజేపీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.

Advertisement

Next Story