సీఈసీగా సుశీల్ చంద్ర నియామకం

by Anukaran |
Sushil Chandra
X

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్‌గా సుశీల్ చంద్ర నియమితులయ్యారు. 24వ సీఈసీగా ఆయనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ని యమించారు. మంగళవారం నుంచి ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. వచ్చే ఏడాది మే 14 వరకు సుశీల్ చంద్ర ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సునీల్ అరోరా సేవలందించారు. సోమవారం ఆయన పదవీకాలం ముగిసింది. సునీల్ అరోరా రిటైర్ అయిన మరుసటి రోజు నుంచి సుశీల్ చంద్ర సీఈసీగా బాధ్యతలను తీసుకున్నారు. సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్‌లలో సీనియర్‌ను ప్రధాన కమిషనర్‌గా నియమిస్తుంటారు.

సునీల్ అరోరా తర్వాత సుశీల్ చంద్రకే సీనియారిటీ ఉన్నది. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ల అసెంబ్లీ ఎన్నికలను సీఈసీగా సుశీల్ చంద్ర పర్యవేక్షించనున్నారు. రెండేళ్లు ఎన్నికల కమిషనర్‌గా సుశీల్ చంద్ర ఉన్నకాలంలో నామినేషన్ ప్రక్రియనంతా ఆన్‌లైన్ చేయడంలో కృషి చేశారు. ఎన్నికల సంఘంలోకి రాకముందు ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) చైర్మన్‌గా సేవలందించారు. అక్రమ సంపద, నల్లధనాన్ని అరికట్టడానికి 2017లో సుశీల్ చంద్ర సారథ్యంలోనే సీబీడీటీ ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ని ప్రారంభించింది.

Advertisement

Next Story