సాగర్ ఉప ఎన్నికలపై సర్వేల జోరు

by Anukaran |
Sagar
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇప్పటికే ఒక రౌండ్ పూర్తికాగా తాజా పరిస్థితిపై మరో సర్వే జరుగుతోంది. పార్టీలన్నీ సర్వేలపైనే నమ్మకాలు పెట్టుకున్నాయి. సర్వే ఫలితాలకు అనుగుణంగా అభ్యర్థులను దించాలనుకుంటున్నాయి టీఆర్ఎస్, బీజేపీలు. అధికార పార్టీకి ఎలాగూ నిఘా వర్గాల నుంచి వివరాలు అందుతున్నాయి. పార్టీలు చేయించుకుంటున్న సర్వేల్లో మిశ్రమ ఫలితాలు వస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అనుకూలత ఉన్నట్లు ఆ పార్టీ సర్వేలో వెల్లడైంది. స్వల్ప తేడా మినహా గెలిచేది టీఆర్ఎస్ పార్టీయే అంటూ ఆ పార్టీ చేయించుకున్న సర్వేలో వెల్లడైంది. దీనికి తోడు సానుభూతి కలిసొస్తుందని తేలింది.

కాంగ్రెస్‌ తర్వాతే టీఆర్ఎస్?

కాంగ్రెస్ పార్టీకి 35% ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ చేయించుకున్న సర్వే సంస్థ పేర్కొంది. సిట్టింగ్ స్థానమైన టీఆర్ఎస్‌కు ఇక్కడ 33% ఓటు బ్యాంకు రావచ్చని మరో సర్వే పేర్కొంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం టీఆర్ఎస్‌కు ద్వితీయ స్థానమేనని సమాచారం. గత నెలలో జరిగిన సర్వేలో టీఆర్ఎస్‌కు కేవలం 30% మాత్రమే ఉండగా ఇప్పుడు కొంత మెరుగుపడినట్లు తెలిసింది. దుబ్బాకలో గెలుపొందినప్పటికీ సాగర్‌లో మాత్రం బీజేపీ 29% ఓటు బ్యాంకుతో మూడవ స్థానానికే పరిమితమైనట్లు సమాచారం. మండలి ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వచ్చినట్లుగా సాగర్‌లోనూ తప్పదని తాజా సర్వే తెలియజేస్తోంది. మండలి ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని (హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం) కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో కాస్త నిశ్శబ్ద వాతావరణమే నెలకొంది. సాగర్‌లో 29% మాత్రమే అని తేలడంతో ఆలోచనలో పడింది. అయితే గత ఎన్నికల్లో కంటే కాస్త మెరుగుపడే అవకాశమే ఉన్నట్లు తేలింది.

టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ

సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకే కాస్త మెరుగైన అవకాశం ఉన్నప్పటికీ రెండో స్థానంలో ఉండొచ్చనుకుంటున్న టీఆర్ఎస్‌కు కేవలం కొంచెం తేడా మాత్రమే ఉన్నట్లు వెల్లడి కావడంతో ఓటర్లను కలవడం తీవ్రం చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో జానారెడ్డి వరుసగా గెలుస్తూ ఉన్నారు. కానీ 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జానారెడ్డి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ గెలుపు ఉప ఎన్నికల్లోనూ పునరావృతమవుతుందా అనేది వేచి చూడాలి. ఖచ్చితంగా గెలిచి తీరాలన్న లక్ష్యంతో అసెంబ్లీ వేదికగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైంది. సాగర్ నియోజకవర్గంలో మొత్తం రెండుంపావు లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో దాదాపు 1.53 లక్షల మంది వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్నారని ప్రకటన చేయడం పరోక్షంగా వారిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లయింది.

Advertisement

Next Story