ఓటుకు నోటు పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

by Shyam |
Revanth Sandra
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆరేళ్ల క్రితం తెలంగాణలో నమోదైన ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టనున్నది. ఈ కేసు నుంచి తప్పించాలంటూ సండ్ర వెంకటవీరయ్య పిటిషన్ దాఖలు చేయగా, ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, ఏసీబీ కోర్టుకు విచారణాధికారంలేదని రేవంత్ మరో పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ రెండూ జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ముందుకు సోమవారం విచారణకు వచ్చాయి. పిటిషన్లలో పేర్కొన్న అంశాలను పరిశీలించిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య గతంలోనూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తనను ఈ కేసు నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని అప్పట్లో విచారించిన హైకోర్టు గతేడాది డిసెంబరులో కొట్టి వేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ సండ్ర వెంకటవీరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసుతో తనకు సంబంధం లేనందున తప్పించాల్సిందిగా తాజా పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఓటుకు నోటు కేసు దర్యాప్తుపై అవినీతి నిరోధక శాఖకు అధికారమే లేదని, దాని పరిధిలోకి రాదని, ఈ కేసుకు ఏసీబీ చట్టం వర్తించదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ రెండు పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టనున్నది.

Advertisement

Next Story