నిర్లక్ష్యం ఖరీదు రూ. 10 లక్షలు

by Sumithra |
నిర్లక్ష్యం ఖరీదు రూ. 10 లక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైద్య కళాశాల సీటుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థికి అవకాశం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించినందుకు హైదరాబాద్‌లోని ‘కిమ్స్’ (కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి సెంటర్) వైద్య కళాశాల యాజమాన్యానికి సుప్రీంకోర్టు రూ. 10 లక్షల జరిమానా విధించింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఆ అభ్యర్థికి తప్పకుండా అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఎం.సూర్యకౌముది అనే విద్యార్థి ఎంఎస్ (సర్జరీ) కోర్సు కోసం రాసిన నీట్ పరీక్షలో ర్యాంకు సంపాదించి ప్రవేశం కోసం అన్ని అర్హతలూ పొందినా కౌన్సిలింగ్ సమయానికి కిమ్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమెకు సీటు ఇవ్వడానికి నిరాకరించింది. ఆమె కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి అడ్మిషన్ ఇచ్చింది.

ఈ నిర్లక్ష్యంతో ఒక సంవత్సరం వృథా అయిందని బాధపడిన కౌముది తొలుత హైకోర్టును ఆశ్రయించింది. కౌముది నిర్లక్ష్యంగానీ, పొరపాటుగానే ఏమీ లేదని, అయినా ఆమె పీజీ కోర్సులో చేరే అవకాశాన్ని కోల్పోయిందని, ఇందుకు కారణం కిమ్స్ యాజమాన్యం నిర్లక్ష్యమేనని వ్యాఖ్యానించింది. ఆ విద్యార్థికి పీజీ కోర్సులో చేరడానికి అన్ని అర్హతలూ ఉన్నందున అదనంగా ఒక సీటును పెంచి అడ్మిషన్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. నేషనల్ మెడికల్ కమిషన్ (గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కు కూడా హైకోర్టు నోటీసు జారీ చేసింది.

అయితే హైకోర్టు ఆదేశించిన ప్రకారం అదనంగా సీటు కేటాయించడం సాధ్యం మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదనంగా సీటు కేటాయించడంలో ఉన్న ఇబ్బందుల్ని వివరించింది. కమిషన్ వివరించిన అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కౌముది విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని మాత్రం సమర్ధించింది. ఆ విద్యార్థికి ఒక సంవత్సరం పాటు విలువైన కాలం వృథా అయిందని, ఇందుకు ఆమెకు నష్టపరిహారంగా పది లక్షల రూపాయలను చెల్లించాలని కిమ్స్ యాజమాన్యాన్ని ఆదేశించింది. వచ్చే సంవత్సరం ఆమెకు తప్పకుండా సీటు కేటాయించాలని స్పష్టం చేసింది.

Advertisement

Next Story