ఆ ఆస్పత్రిలో అసలు విషయం తెలిస్తే.. మీరు షాకవుతారు!

by Anukaran |
ఆ ఆస్పత్రిలో అసలు విషయం తెలిస్తే.. మీరు షాకవుతారు!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సుస్తీ అయ్యింది. 700 పడకల ఈ ఆసుపత్రి నిత్యం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాల ప్రజలకు వైద్యం అందిస్తోంది. దవాఖానలోకి కరోనా వైరస్ అడుగు పెట్టిన తర్వాత పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఏడు సంవత్సరాలుగా ఇన్‌చార్జీలే సూపరింటెండెంట్‌లుగా వ్యవహరిస్తున్నారు. దానికి తోడు ప్రైవేట్ ప్రాక్టీస్ ఉన్న కొందరి వైద్యుల అజమాయిషీ ఉండడంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. జూన్‌లో 200 పడకలతో కొవిడ్ స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు. ఆ నెల 6 నుంచి వైరాలజీ ల్యాబ్‌లో కొవిడ్ పరీక్షలను ప్రారంభించారు. ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ మండలి ఉన్నప్పటికీ అది ఉత్సవ విగ్రహం లాంటి కమిటీలా మారిందనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్‌గా నారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆకస్మిక తనిఖీలో 112 మంది వైద్యులకు, సిబ్బందికి నోటీసులు ఇచ్చినా మార్పు రాలేదు. ఇటీవల కొవిడ్ ఆసుపత్రిలో నలుగురు రోగులు ఆక్సిజన్ అందక చనిపోవడం వివాదాస్పదం అయింది. అందులో ఒక మృతదేహాన్ని ఆటోలో తరలించడంపై వివాదం రెట్టింపు అయింది. చివరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఆసుపత్రిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

ముగ్గురే స్థానికంగా..

ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కావాలంటే ప్రొఫెసర్‌లు మాత్రమే అర్హులు. ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రిలో 19 మంది ప్రొఫెసర్‌లు ఉండగా జిల్లా కేంద్రానికి చెందిన వారు ముగ్గురు మాత్రమే స్థానికంగా ఉంటారు. మిగిలిన వారు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అసలు కొవిడ్ వచ్చిన తరువాత హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్లు రావట్లేదనే విమర్శలు ఉన్నాయి. అసలు ఆసుపత్రి సూపరింటెండెంట్‌లకు సీనియర్‌ల సహకారం ఉండదని ప్రచారం. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిపై పెత్తనం అంతా జిల్లా కేంద్రంలో ప్రైవేట్ దవాఖానాలు, నర్సింగ్ హోంలు, ప్రైవేట్ క్లినిక్‌లు నడుపుతున్నవారిదే.. వారు తమ సొంత ప్రయోజనాల కోసం ముఖ్యంగా సర్కారు ఆసుపత్రికి వచ్చే రోగులను తమ సొంత ప్రాక్టీస్‌కు తరలించేవారే ఎక్కువ అనే ఆరోపణలు ఉన్నాయి. ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల గ్రూప్ లాబియింగ్ చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రికి కలెక్టర్, ఇతర అధికారులు తనిఖీలకు వచ్చే సమాచారాన్ని తెలుసుకుని, బయో మెట్రిక్ ఉన్న దానిని ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో కలిపి మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పదవి ఆశిస్తున్న వారిలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉన్నవారికే పదవి దక్కుతుందనే అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. అదే జరిగితే సర్కార్ దవాఖానలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న సర్కార్ దవాఖాన వైద్యుల పెత్తనం పెరగడం ఖాయం.

పని ఒత్తిడిలో జూడాలు

ప్రొఫెసర్లు, సీనియర్లు రాకపోవడంతో జూడాలపై పని ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రిలో ప్రొఫెసర్‌లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ వైద్యులకు కొరత లేదు. వైద్య కళాశాలలో తరగతులు జరిగినప్పుడు వారికి తరగతుల బోధన, మిగిలిన సమయంలో రోగులకు వైద్య సేవలు అందించాలి. కానీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు విధులకు ఎగనామం పెట్టిన ప్రతి నెల పూర్తి వేతనం తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారు తమ పరిధిలో 7 నుంచి 10 మంది జూనియర్ వైద్యులను, ఎస్‌ఆర్‌లను ఉంచుకొని కనీసం ఆసుపత్రిలో అడుగుపెట్టకుండా రోగుల నాడిపట్టకుండా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పై పెచ్చు జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ దవాఖానాలలో ఎస్ఆర్ లు, జూడాలు పార్ట్ టైం వైద్యులుగా తమ ఆసుపత్రుల్లో పనిచేయించుకుని రెండు చేతులా సంపాదిస్తున్నారు. కొవిడ్ వచ్చిన తరువాత సీనియర్‌లు ఆసుపత్రికి రావడమే మానేశారు. కరోనా వైరస్‌కు వైద్యం, పరీక్షల విషయంలో జూడాలు మాత్రం అలుపెరగకుండా పనిచేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం డీఎంఈ ద్వారా శాశ్వత సూపరింటెండెంట్‌ను నియమించి ఆసుపత్రిలో పేదలకు అందే వైద్యాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story