- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లాక్‌డౌన్ లో పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా..?
దిశ, న్యూస్‌బ్యూరో: ఇప్పుడు ఏ బడిని చూసినా మూతబడి ఉంది. ఏ ఇంటిని చూసినా పిల్లల అల్లరేఅల్లరి. కిష్కింధకాండే.. ఏ ఇంట్లోనూ సహజమైన ఆటవిడుపులేదు.. పిల్లల్లో పట్టువిడుపుల్లేవు. కరోనా దెబ్బకు అన్నీ లాక్‌డౌన్ అయ్యాయి కదా! అందులో భాగంగా విద్యాసంస్థలు సుమారు నెల రోజులుగా తెరుచుకోవడంలేదు. సరిగ్గా విద్యాసంవత్సరం ముగిసేవేళ.. పరీక్షలు జరగాల్సిన సమయాన ఈ ‘లాక్‌డౌన్’ వచ్చింది. ఇంకేం.. పరీక్షలు రాసేది తప్పింది. పుస్తకాలతో కుస్తీ పట్టేదిలేదు. ఇక బుడుగులు ఊరుకుంటారా.. ఇళ్లల్లో పిడుగుల్లా దూసుకుపోతున్నారు. హాయిగా, జాలీగా సాగాల్సిన హాలీడేస్ అల్లరికి కేరాఫ్‌గా మారాయి. కొంటె పనులు చేస్తూ అమ్మనాన్నల చేత దెబ్బలు తింటున్నారు. కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు ఇళ్లల్లో ఉండే తమ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. వాట్సాప్, మెయిల్స్ ద్వారా తల్లిదండ్రులకు అసైన్‌మెంట్, ప్రాజెక్టు వర్క్‌లు అప్పగిస్తున్నాయి. అవి ఎంత వరకు వచ్చాయో ఆరా తీస్తున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. విద్యార్థి పూర్తి చేసిన తర్వాత వాటిని ఫొటోలు తీసి పంపించాలని సూచిస్తున్నాయి. స్కూల్ రోజుల్లో కూడా ఇంత హోం వర్క్ ఉండదని విద్యార్థులు వాపోతున్నారు. ఎక్కడో దూరంగా రెసిడెన్సియల్స్‌లో, హాస్టళ్లలో ఉండే తమ పిల్లలను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు పీకి పందిరేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. కరోనా కారణంగా తాము నరకం చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పిల్లలేమో పై చదువుల మీద ధ్యాసపెట్టి చదువుకుంటున్నారు. పలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేరవుతున్నారు.
ఫోన్‌లే కదా.. అని పోన్లే అనలేం!
ఈ ఫోన్లు ఉన్నాయే… దగ్గర ఉన్నవాళ్లను దూరం పెడతాయి.. దూరం ఉన్నవాళ్లను దగ్గరికి చేస్తాయి. సెల్‌ఫోన్లు అందుబాటులో లేకుంటే పెద్దలకే కాదు, చిన్నారులకు కూడా నిమిషం గడవడం లేదు. ఆ ఫోన్లే పిల్లల నేస్తాలయ్యాయి. ఫోన్లే కదా.. అని పోన్లే అనే పరిస్థితిలేదిప్పడు. అస్తమానం వాటితోనే ఆటలు, పాటలూ. తీసుకుంటే తిరిగివ్వరు. పట్టుకుంటే ముట్టుకోనివ్వరు. టెక్నాలజీ తెచ్చిన మార్పులకనుగుణంగా మారిపోతున్నారు. ఫోన్ల వాడకం గురించి తెలిసినా, తెలియకపోయినా అవి తమ చేతుల్లో ఉండాల్సిందే. యూట్యూబ్‌లో రైమ్స్, కార్టూన్ వీడియోలు చూస్తునో.. ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూనో రోజంతా గడుపుతున్నారు. స్కూల్ అసైన్‌మెంట్ ఉన్నా లేకపోయినా పిల్లల చేతుల్లో మొబైల్ ఫోన్లు చేరిపోతున్నాయి. అసైన్‌మెంట్లు ఉన్న కొందరు పిల్లలు చూస్తూ తమ పని తాము చేసుకుంటున్నారు. కొందరు పిల్లల వద్ద నుంచి ఫోన్లు తీసేసుకుంటే వారు చేసే అల్లరి, కేకలు మామూలుగా ఉండటం లేదు. కొన్నిచోట్ల ఓపిక నశించిన తల్లిదండ్రులు వారిని రెండు దెబ్బలు వేయక తప్పడం లేదు. ఇక ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నవారైతే చెప్పనక్కర లేదు. రోజుకొకసారైనా వారి మధ్య గొడవ రావాల్సిందే.. తల్లిదండ్రులు జోక్యం చేసుకోవాల్సిందే. ఫోన్ రగడ తప్పదు. దాని కోసం దెబ్బలాడాల్సిందే.
మా సెల్‌ఫోన్లు పిల్లల దగ్గరే ఉంటున్నాయి – కాటం రాజు, కావ్య దంపతులు, ఎల్‌బీ నగర్, హైదరాబాద్
మాకు ఇద్దరు అమ్మాయిలు. పేర్లు సహస్ర, తేజశ్రీ. పెద్దమ్మాయి సహస్ర ఒకటో తరగతి చదువుకుంటోంది. చిన్నమ్మాయికేమో రెండేండ్లు. మేం చేసే బిజినెస్ రోజూ ఉండటం లేదని అందరమూ ఇంటి దగ్గరే ఉంటున్నాం. మామూలుగా స్కూల్‌కు వెళ్లే టైంలో ఉదయం అన్నం తినేటపుడు సహస్ర నా మొబైల్‌లో రైమ్స్ చూస్తుంటుంది. ఆమెను స్కూల్‌లో వదిలేసి నేను నా పని మీద వెళ్లిపోతాను. ఇప్పుడు అలా కాదు. రోజంతా నా ఫోన్ తన దగ్గరే ఉంటుంది. నాకేమైనా ఫోన్ కాల్స్ వచ్చినా తిరిగివ్వడం లేదు. ఎక్కడి నుంచైనా ఫోన్ కాల్ వస్తే ‘డాడీ లేడంకుల్’ అని పెట్టేసి గేమ్ ఆడుకుంటుంది. ప్రతీ రోజూ సహస్ర టిఫిన్ తిని క్యాండీ క్రష్ గేమ్ ఆడిన తర్వాతే స్నానం చేస్తుంది. యూట్యూబ్‌లో తెలంగాణ జానపద పాటలు వింటుంది. ఫస్ట్‌క్లాస్ అయిపోయింది. ఉదయం 11 -12 గంటల వరకూ ఆన్‌లైన్ క్లాసులు వింటుంటుంది. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం చేసి మళ్లీ ఫోన్లో గేమ్ ఆడుకుంటుంది. లూడో, క్యారం బోర్డు, కలర్స్ గేమ్, క్యాండీ క్రష్, బాల్స్ షూటింగ్ ఆడుకుంటుంది. సొంతంగా డౌన్‌లోడ్ కూడా చేసి చూపిస్తుంటుంది. మా ఇద్దరు పిల్లలు ఫోన్ కోసం కొట్టుకోవడం, అన్నం కిందపోయడం, ఏదో ఓ కొంటె పని చేయడం పరిపాటి అయింది. సాయంత్రం, రాత్రీ కూడా ఇద్దరూ ఫోన్లే పట్టుకుంటారు. మధ్యలో ఛార్జింగ్ పోతుందన్నా, ఫోన్ కాల్స్ వచ్చాయన్నా వినరు. చిన్నది కూడా అక్క గేమ్స్ ఆడుతుంటే పక్కన కూర్చొని చూస్తుంటుంది. మధ్యలో లాక్కోవడానికి చూసినపుడు సహస్ర నెట్టేస్తుంది. ఇద్దరి మధ్య చిన్న, చిన్న గొడవలు రోజులో ఐదారుసార్లన్నా అవుతాయి. చిన్నమ్మాయి యూట్యూబ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ చూస్తుంది.
పిల్లల మధ్య ఎప్పడూ ఫైటింగే – సతీష్, రాధిక దంపతులు, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా
మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి సన్నీ హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేటు స్కూళ్లో ఏడో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్ విధించడంతో ఇక్కడకు తీసుకొచ్చాం. చిన్నబ్బాయి లక్కీ. లోకల్ ప్రైవేటు స్కూళ్లో యూకేజీ చదువుతున్నాడు. ఇప్పుడు వారిద్దరి మధ్య రోజూ ఫైటింగే. లక్కీకి స్కూల్ వాళ్లు అసైన్‌మెంట్స్ ఏమీ ఇవ్వలేదు. కానీ, సన్నీకి వాట్సాప్‌లోనే ప్రాజెక్టు, డెయిలీ అసైన్‌మెంట్ ఇస్తున్నారు. అవి పూర్తయ్యాక వాటి ఫొటోలను కూడా అడుగుతున్నారు. రోజొక కాన్సెప్ట్‌తో చేయిస్తున్నారు. పిల్లలను ఎడ్యుకేట్ చేయడం బాగానే ఉంది. కానీ, ఫోన్లో వచ్చే వాటిల్లో అక్షరాలు సరిగా కన్పించడం లేదు. ప్రింటింగ్ తీయాలన్నా, కలర్ షీట్లు బయటదొరికే పరిస్థితి లేదు. తన పని ముగిసిన తర్వాత మా మొబైల్ లో గేమ్స్ ఆడుతుంటారు. అన్నం తినేటపుడు కూడా మొబైల్ చేతిలో ఉండాలి. ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నిస్తే లక్కీ నేలకేసి కొడతాడు. పెద్దోడు కొంచెం అర్థం చేసుకుంటాడు. సెలవుల కోసమని ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని మరీ సిటీ నుంచి పెద్దబ్బాయిని తీసుకొచ్చాం.. ఇప్పుడు ఇద్దరూ కలిసి అల్లరి, అల్లరి చేస్తున్నారు. అబ్బాయి అక్కడే ఉంటే చూడలేదని మనసుకు బాధనిపిస్తుంది. ఇక్కడికి తీసుకొస్తే ప్రశాంతంగా ఒక్క నిమిషం ఉండరు. సన్నీ వచ్చేటపుడు బాల్, బ్యాట్ తీసుకొచ్చాడు. సాయంత్రం పిల్లలతో కలిసి మేడపైనా ఆడుకుంటున్నారు. ఆ తర్వాత మేం ఇంటి పనుల్లోకి వెళ్తే.. వాళ్లు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతుంటారు. మా చేతుల్లో కంటే స్మార్ట్ మొబైల్ వారి దగ్గరే ఎక్కువగా ఉంటోంది.
చదువుకోవడానికి టైం దొరికింది – కావ్య, పదో తరగతి, నకిరేకల్
నకిరేకల్ రెసిడెన్సియల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నా. ఎగ్జామ్‌లు 15 రోజులు ఉన్నప్పుడు కడుపు నొప్పి రావడంతో ఇంటికి వచ్చాను. అపెండిక్స్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ కోసం ఇంటికి, దవాఖానాకు తిరిగేందుకు పది రోజులు పోయాయి. ఆ రోజుల్లో పుస్తకం కూడా పట్టుకోలేదు. రోజంతా టెన్షన్ ఉండేది. పదో తరగతి ఫెయిల్ అవుతానేమోనని భయం వేసింది. రెండు పరీక్షలు రాసిన తర్వాత లాక్‌డౌన్ ప్రకటించారు. ఇప్పుడు ఈ లాక్‌డౌన్ రోజులన్నీ కలిసి వచ్చినట్టయింది. మిగిలిన సబ్జెక్టుల పోర్షన్ చదువుకుంటున్నా. నెల రోజుల టైం ఆ విధంగా కలిసి వచ్చినట్టయింది. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. బాగా ప్రిపేర్ అవుతున్నా. మిగిలిన పరీక్షలను లాక్‌డౌన్ తర్వాత పెడుతారేమో అనుకుంటున్నా.
ఎంట్రన్స్‌ల కోసం ప్రిపేర్ అవుతున్న – విక్రం, హైదరాబాద్
ఇంటర్మీడియట్ సెకండియర్ అయిపోయింది. చిలుకూర్ దగ్గరలోని రెసిడెన్సియల్ కాలేజీలో చదువుకుంటున్నా. మద్రాస్ ఐఐటీ, జేఈఈ ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నా. దీంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్‌కు కూడా ప్రిపేర్ అవుతున్నా. ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం కలిపి నాలుగు గంటలు చదువుకుంటున్నా. మధ్యలో జబర్దస్త్ లాంటి కామెడీ సీరియల్స్, సినిమాలు చూస్తుంటా. మొన్నటివరకూ ఇంటి దగ్గరే ఉన్నా. రెండురోజుల క్రితం మళ్లీ కాలేజీ క్యాంపస్‌కు వచ్చి చదువుకుంటున్నా. ఇంటి దగ్గరైతే ఎక్కువగా చదువుకోలేపోయా. ఇక్కడైతే ప్రైవసీ దొరుకుతుంది. క్లాస్‌లు, మిగిలిన విద్యార్థులు లేకపోవడం కూడా మంచి అడ్వాంటేజ్‌గా ఉంటుంది.
Tags: corona, lockdown, children, school, mobile, video games