మార్కెట్లకు చేరిన మదుపర్ల సంపద

by Harish |
మార్కెట్లకు చేరిన మదుపర్ల సంపద
X

దిశ, వెబ్‌డెస్క్: గతవారం బ్యాంకింగ్ రంగ, ఫైనాన్షియల్ కంపెనీల షేర్ల మద్దతుతో మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. వీటి జోరు కారణంగా కొవిడ్-19 (Kovid-19)కి ముందున్న స్థాయికి సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) సూచీలు చేరుకున్నాయి. కాబట్టి గతవారం ఈక్విటీ మార్కెట్ల (Equity markets)కు లాభాలు తెచ్చిన వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల కుప్పకూలిన మార్కెట్లు నెమ్మదిగా కోలుకుని, గత వారాంతంతో కరోనాకు ముందునాటి స్థాయికి చేరుకున్నాయి.

మార్చి నెలలో సెన్సెక్స్ మార్కెట్ (Sensex market) క్యాపిటలైజేషన్ రూ. 1.13 లక్షల కోట్లుగా ఉండగా, గత వారానికి సెన్సెక్స్ మార్కెట్ క్యాప్ రూ. 1.58 లక్షల కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న కొద్దీ ఈక్విటీ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ పరిణామాలతో మదుపర్లు పోగొట్టుకున్న సంపదను తిరిగి పొందగలుగుతున్నారు.

మార్చి నుంచి ఇప్పటివరకు 5 నెలల కాలంలో మార్కెట్లకు రూ. 45 లక్షల కోట్ల సంపద తిరిగొచ్చింది. నిఫ్టీలో బ్యాంక్ ఇండెక్స్ (Bank Index) మొత్తం 9.97 శాతం లాభపడగా, కేవలం గతవారంలోనే 4.19 శాతం పుంజుకుంది. ఇక, ఈ వారంలో టెలికాం రంగానికి సంబంధించి ఏజీఆర్ అంశం, లోన్ మారటోరియంలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లపై ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఏజీఆర్ తీర్పు వల్ల టెలికాం రంగం షేర్లపైన, లోన్ మారటోరియం తీర్పు బ్యాంకింగ్ రంగం షేర్లపైన ప్రభావం చూపనున్నట్టు, తీర్పును బట్టి మార్కెట్ల ర్యాలీ ఉండనుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story