నష్టాలతో ముగిసిన మార్కెట్లు

by Harish |
నష్టాలతో ముగిసిన మార్కెట్లు
X

ముంబయి: వరుసగా మూడు రోజులు లాభాలను ఆర్జించిన దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలను మూటగట్టుకున్నాయి. మదపర్లు ఆల్ టైమ్ రికార్డు 44,230 వద్ద లాభాల స్వీకరణకు దిగడంతో అన్నిరకాల సూచీలు నష్టపోయాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 712 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 193 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 580 పాయింట్లు కోల్పోయి 43,600 వద్ద ముగియగా, నిఫ్టీ 167 పాయింట్లు పతనమై 12,772 వద్ద క్లోజయ్యాయి.

ఫైనాన్స్ సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.75శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.40 శాతం నష్టపోయాయి. నిఫ్టీలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి. దాదాపు 5 శాతం పతనమై రూ.239.50 వద్ద ఎస్‌బీఐ షేరు ఉంది.

ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఈచర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హిందాల్కో తదితర కంపెనీల షేర్లు 2.5శాతం నుంచి 4శాతం మధ్యలో నష్టపోయాయి. కానీ, స్పైస్ జెట్ కంపెనీ షేర్లు రాకెట్‌లా దూసుకుపోయాయి. బోయింగ్ కంపెనీకి చెందిన 737 మ్యాక్స్ విమానాలపై 20 నెలల క్రితం విధించిన నిషేధాన్ని అమెరికా ఏవియేషన్ రెగ్యులేటరీ ఎత్తివేయడంతో స్పైస్ జెట్‌ షేర్లు 16 శాతం లాభపడ్డాయి. స్పైస్‌జెట్ వద్ద బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఎనిమిది వరకు ఉన్నాయి.

Advertisement

Next Story