నిరాడంబరంగా భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవం

by Sridhar Babu |
నిరాడంబరంగా భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవం
X

దిశ‌, ఖ‌మ్మం : భద్రాచల పుణ్యక్షేత్రంలో భ‌క్తులు లేకుండానే జ‌గదాభిరాముడి క‌ల్యాణం జ‌రిగిపోయింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గురువారం అతికొద్దిమంది ఆల‌య సిబ్బంది, ప్ర‌జాప్ర‌తినిధులు, అర్చ‌కులు, వేద‌పండితుల స‌మ‌క్షంలో నిత్య‌కల్యాణ వేదిక‌పై సీతారాముల ప‌రిణ‌యం వేడుక‌గా సాగింది. సీత‌మ్మ సిగ్గుప‌డుతుండ‌గా…రామ‌య్య అమ్మ‌వారి మెడ‌లో తాళిక‌ట్టాడు. సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముడి జన్మదినం చైత్రశుద్ధ నవమిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ రోజును హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు.

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకల అంగరంగా వైభవంగా సాగుతాయి. అందులో భాగంగానే ద‌క్షిణ అయోధ్య‌గా, తెలుగు వారి ఇల‌వేల్పుగా ప్ర‌సిద్ధిపొందిన భ‌ద్రాద్రి రాముడికి క‌ల్యాణం జ‌రిపిస్తుంటారు. ఏటా అంగరంగ వైభ‌వంగా మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభిత మండపంలో వేలాది మంది భ‌క్తులు వీక్షిస్తుండ‌గా స్వామివారి కల్యాణం నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం చ‌రిత్ర‌లో క‌నీవిని ఎరుగ‌నంత రీతిలో శ్రీ సీతారాముల క‌ళ్యాణం అత్యంత నిరాడంబరంగా జ‌రిగింది. కరోనా వైరస్‌ ప్రభావంతో దేవస్థానం చరిత్రలో తొలిసారిగా రామయ్య కళ్యాణాన్ని ఆలయంలో అంత‌రంగిక వేదిక‌పై నిర్వహించారు. 100కు మించ‌ని భ‌క్తుల స‌మ‌క్షంలో వేడుక‌ను పూర్తి చేశారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత, పరిశుభ్రత ఏర్పాట్ల‌ మధ్య కల్యాణ ఉత్స‌వం జ‌రిగింది. అదికూడా సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూనే ప్ర‌తీ ఒక్క‌రూ మాస్కులు ధరించి ఉండ‌టం గ‌మ‌నార్హం. మంత్రాలు చ‌దివే వేద‌పండితులు, ప్ర‌ధాన అర్చ‌కులు మిన‌హా మిగ‌తా వారంద‌రూ కూడా మాస్కులు ధ‌రించే స్వామివారి కల్యాణాన్ని వీక్షించ‌డం విశేషం.

భ‌క్తుల అనుమ‌తికి నిరాక‌ర‌ణ‌:

కరోనా వైరస్‌ ప్రభ‌లుతున్న క్రమంలో భక్తుల రాక‌ను ప్ర‌భుత్వం నిషేధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విధంగానే భ‌క్తులను ఎవ‌రిని ఆల‌యంలోకి అనుమ‌తించ‌లేదు. స్థానికంగా ఉండే కొంత‌మంది భ‌క్తులు, వ్యాపారులు కల్యాణాన్ని వీక్షించేందుకు వ‌చ్చారు. అయితే వారిని పోలీసులు వెంట‌నే అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని సున్నితంగా హెచ్చ‌రించ‌డంతో నిరాశతో వెళ్లిపోయారు. రామాలయం నిర్మాణం చేపట్టిన మూడున్నర శతాబ్దాలలో భక్తుల స‌మ‌క్షంలో కాకుండా ఏనాడు ఈ విధంగా కల్యాణం జరగలేదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

త‌లంబ్రాల స‌మ‌ర్ప‌ణ‌:

రామయ్య కల్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని పురస్కరించుకొని దేవస్థానం అధికారులు కల్యాణ మండపాన్ని పుష్పాలతో అలంకరించారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించారు. అలాగే ఎమ్మెల్యే పొదెం వీర‌య్య కూడా స్వామివారికి త‌లంబ్రాలు స‌మ‌ర్పించారు. వివిధ మ‌ఠాలు, పీఠాధిప‌తుల ప్ర‌తినిధులు కూడా స్వామి వారికి ప‌ట్టువ‌స్త్రాలు, త‌లంబ్రాలను స‌మ‌ర్పించారు. కార్య‌క్ర‌మంలో మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జడ్పీ చైర్మన్‌ కోరం కన‌క‌య్య‌, రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, ఎస్పీ సునీల్ దత్, దేవస్థానం ఈవో జి.నర్సింహులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags: Seetharamula Kalyanam, indrakaranreddy, puvvada ajay, bhadrachalam

Advertisement

Next Story