పుంజుకున్న ముంబై.. చిత్తుగా ఓడిన బెంగళూరు

by Harish |
పుంజుకున్న ముంబై.. చిత్తుగా ఓడిన బెంగళూరు
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. యూపీ వారియర్స్ చేతిలో ఓటమితో వెనుబడిన ఆ జట్టు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయంతో మళ్లీ విజయ బాట పట్టింది. మరోవైపు, బెంగళూరు చిత్తుగా ఓడి వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. ఆర్సీబీ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని ముంబై 15.1 ఓవర్లలోనే ఛేదించింది. మూడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. ఓపెనర్ యాస్తికా భాటియా(31) బౌండరీలతో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. దూకుడుగా ఆడే క్రమంలో ఆమె 4వ ఓవర్‌లోనే అవుటైంది. మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్(26) కాసేపటికే వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అమేలియా కెర్(40 నాటౌట్) ధాటిగా ఆడింది. నాట్ స్కివర్ బ్రంట్(27)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించింది. నాట్ స్కివర్ అవుటైనా పూజ వస్త్రాకర్(8 నాటౌట్) సహకారంతో అమేలియా కెర్ జట్టును విజయతీరాలకు చేర్చింది. బెంగళూరు బౌలర్లలో సోఫి డివైన్, జార్జియా వారేహమ్, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో ముంబై జట్టు పాయింట్స్ టేబుల్‌లో మూడు స్థానాలను ఎగబాకి తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.

పెర్రీ పోరాటం

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన బెంగళూరు ముంబై బౌలింగ్ తడబడింది. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది. స్మృతి మంధాన(9), సోఫి డివైన్(9), సబ్బినేని మేఘన(11), రిచా ఘోష్(7) నిరాశపర్చడంతో ఆర్సీబీ 42 పరుగలకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ఎల్లీస్ పెర్రీ(44 నాటౌట్) ఒంటరి పోరాటం చేసింది. మోలినిక్స్(12), వారేహమ్(27) సహకారంతో జట్టుకు పోరాడే స్కోరు అందించేందుకు కష్టపడింది. పెర్రీ పోరాటంతోనే బెంగళూరు నిర్ణీత ఓవర్లలో కష్టంగా 131 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో పూజ వస్త్రాకర్, నాట్ స్కివర్ బ్రంట్ రెండేసి వికెట్లు తీయగా.. వాంగ్, సైకా ఇషాక్‌ చెరో వికెట్ పడగొట్టారు.

సంక్షిప్త స్కోరుబోర్డు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 131/6(20 ఓవర్లు)

(ఎల్లీస్ పెర్రీ 44 నాటౌట్, వారేహవ్ 27, పూజ వస్త్రాకర్ 2/14, నాట్ స్కివర్ బ్రంట్ 2/27)

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 133/3(15.1 ఓవర్లు)

(అమేలియా కెర్ 40 నాటౌట్, యాస్తికా భాటియా 31)

Advertisement

Next Story