Arshdeep Singh : వారే నాకు స్ఫూర్తి : అర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Harish |
Arshdeep Singh : వారే నాకు స్ఫూర్తి : అర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : టెస్టుల్లో అవకాశం వస్తే కచ్చితంగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని టీమ్ ఇండియా యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యానించాడు. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత అర్ష్‌దీప్ శుక్రవారం చండీగఢ్ యూనివర్సిటీని సందర్శించాడు. అతనికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టెస్టు అరంగేట్రంపై ఎదురైన ప్రశ్నకు అర్ష్‌దీప్ బదులిస్తూ.. ‘ఒక ఆటగాడిగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా 100 శాతం కష్టపడతా. టెస్టుల్లో ఆడే అవకాశం వస్తే కచ్చితంగా నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా.’ అని తెలిపాడు.

అలాగే, ఎవరు నుంచి స్ఫూర్తి పొందుతారు? అనే దానికి స్పందిస్తూ..‘ప్రతి ఒక్కరి నుంచి స్ఫూర్తి పొందాలని చూస్తా. తరగతి గదిలో టాప్ స్టూడెంట్ నుంచి ఫ్రొఫెసర్ వరకు ప్రేరణగా తీసుకుంటా. తమ జీవితాల్లో గొప్పగా ఉన్న వారి నుంచి ప్రేరణ పొందుతాను. యువతకు ఇచ్చే సందేశం ఒక్కటే. ఎప్పుడూ మీరు మీ అత్యుత్తమైనదే ఇవ్వండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది.’ అని చెప్పుకొచ్చాడు.

కాగా, ఇటీవల భారత్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలవడంలో అర్ష్‌దీప్ కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. కొంతకాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అతను నిలకడగా రాణిస్తున్నాడు. 52 టీ20లు, ఆరు వన్డేల్లో 79 వికెట్లు తీశాడు. దీంతో త్వరలోనే అతను టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed