మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల హవా..

by Vinod kumar |
మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల హవా..
X

న్యూఢిల్లీ: మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పోటీల్లో రెఫరీ పోటీలు ఆపేంతగా (ఆర్ఎస్‌సీ-రెఫరీ స్టాప్స్ కాంటెస్ట్) 48 కిలోల కేటగిరిలో నీతూ ఘంఘాస్, 57 కిలోల కేటగిరిలో మనీషా మౌన్ ప్రత్యర్థులకు తమ పంచ్‌ల రుచి చూపించారు. కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ నీతూ తొలి రౌండ్‌లో తజికిస్తాన్‌కు చెందిన సుమైయా క్వొసిమోవాను చిత్తు చేసింది. కాగా గతేడాది కాంస్య పతక విజేత మనీషా మూడో రౌండ్ పోరులో టర్కీకి చెందిన నుర్ ఎలిఫ్ టుర్హాన్‌పై విజయం సాధించింది. అయితే శశి చోప్రా (63 కిలోలు) 0-4తో జపాన్‌కు చెందిన మై కిటో చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ప్రతిసారీ వీళ్లిద్దరు బాగానే పోరాడారు. నీతూ దూకుడు కొనసాగించింది. నీతూ డైరెక్ట్ పంచ్‌లు ఇవ్వడంతో తజకిస్తాన్ బాక్సర్‌ క్వొసిమోవాకు రెఫరీ రెండుసార్లు స్టాండింగ్ కౌంట్ ఇచ్చారు. న్యాయనిర్ణేతలు ఫలితాలు ప్రకటించగానే తజకిస్తాన్ బాక్సర్ తన థంబ్స్‌ను డౌన్ చేసి చూపిస్తూ తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది. మరోవైపు అనుభజ్ఞురాలైన మనీషా ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పంచ్‌ల వర్షం కురిపించింది. టర్కీ బాక్సర్ కంటే ఎత్తుగా ఉండే మనీషా దాన్ని ఉపయోగించుకుంది. లెఫ్ట్, రైట్ నుంచి పంచ్‌లు ఇస్తూ ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. తొలి మూడు నిమిషాల్లో రెండు స్టాండింగ్ కౌంట్‌ల తర్వాత టర్కీ బాక్సర్ రెండో రౌండ్‌లో అటాకింగ్‌కు దిగింది. కానీ మనీషా మాత్రం దూకుడును ఆపలేదు.

Advertisement

Next Story