ఉత్కంఠ మ్యాచ్‌లో శ్రీలంక విజయం.. పోరాడిన బంగ్లాకు తప్పని ఓటమి

by Harish |
ఉత్కంఠ మ్యాచ్‌లో శ్రీలంక విజయం.. పోరాడిన బంగ్లాకు తప్పని ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ పర్యటనను శ్రీలంక జట్టు విజయంతో మొదలుపెట్టింది. మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసింది. సిల్హెట్ వేదికగా సోమవారం చివరి వరకు ఉత్కంఠగా సాగిన తొలి మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై శ్రీలంక విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లును కోల్పోయి 206 పరుగులు చేసింది. ధాటిగా ఆడిన సమరవిక్రమ(61 నాటౌట్), కుసాల్ మెండిస్(59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. సమరవిక్రమకు తోడు అసలంక(44 నాటౌట్) ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో శ్రీలంక 200 పరుగుల మార్క్‌ను దాటింది. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్, రషీద్ హుస్సేన్ చెరో వికెట్ తీశారు.

అనంతరం 207 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ పోరాడి ఓడిపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లను కోల్పోయి 203 పరుగులు చేసింది. టాప్-4 బ్యాటర్లు నిరాశపర్చిన వేళ.. జాకర్ అలీ(68), మహ్ముదుల్లా(54) హాఫ్ సెంచరీలతో జట్టును పోటీలోకి తీసుకొచ్చారు. అయితే, శ్రీలంక బౌలర్లు సమిష్టిగా రాణించడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్‌లో 12 పరుగులు కావాల్సిన సమయంలో షనక అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీయడంతోపాటు 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్, బినురా ఫెర్నాండో, డసున్ షనక రెండేసి వికెట్లు పడగొట్టగా. మహేశ్ తీక్షణ, పతిరణకు చెరో వికెట్ దక్కింది. ఈ విజయంతో శ్రీలంక మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే వేదికపై బుధవారం రెండో టీ20 జరగనుంది.

Advertisement

Next Story