ఓటమితోనే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా

by Vinod kumar |
ఓటమితోనే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా
X

దుబాయ్: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కు ముగింపు పలికిన సానియా.. దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆటకు వీడ్కోలు పలికింది. దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌‌తో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు ఆమె ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. టోర్నీలో మంగళవారం జరిగిన ఉమెన్స్ డబుల్స్‌ తొలి రౌండ్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన మాడిసన్ కీస్‌తో కలిసి ఆఖరి మ్యాచ్‌ ఆడిన సానియాతో ఓటమితోనే ఆటకు గుడ్‌బై చెప్పింది.

రష్యా ద్వయం వెరోనికా కుడెర్మెటోవా-లియుడ్మిలా సామ్సోనోవా 6-4, 6-0 తేడాతో సానియా జోడీ ఓటమిపాలైంది. తొలి సెట్‌లో రష్యా జోడీకి బ్రేక్‌పాయింట్స్‌తో సానియా జంట గట్టిపోటీనిచ్చింది. 4-4తో స్కోరు సమమైన సమయంలో రష్యా ద్వయం సానియా జోడీకి బ్రేక్ వేస్తూ తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. ఇక, రెండో సెట్‌లో సానియా జోడీ తేలిపోయింది. ఆ సెట్ ఏకపక్షంగా జరగగా.. వరుస సెట్లతో రష్యా జోడీ విజేతగా నిలిచింది. దాంతో సానియా ఆఖరి మ్యాచ్‌‌లో ఓటమిపాలైంది.

2003లో ఫ్రొఫెషనల్ టెన్నిస్‌లో అడుగుపెట్టిన ఆమె దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. సానియా రెండు దశాబ్దాల కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించింది. అందులో 2009, 2012, 2014లో మూడు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్(ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్) సొంతం చేసుకుంది. ఉమెన్స్ డబుల్స్‌లో 2015లో యూఎస్ ఓపెన్, వింబుల్డన్‌ టైటిల్స్ సాధించింది.

2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ డబుల్స్ చాంపియన్‌గా నిలిచింది. సానియా కెరీర్‌లో ఇదే చివరి గ్రాండ్‌స్లామ్ టైటిల్. చివరి గ్రాండ్‌స్లామ్ అయిన ఆస్ట్రేలియన్‌లో ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌ ఈవెంట్‌లో సానియా.. రోహన్ బోపన్నతో కలిసి ఫైనల్‌కు చేరినా.. తుది పోరులో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇటీవల సానియా మీర్జాను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ మెంటార్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే. దాంతో డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్‌లో సానియా బెంగళూరు జట్టుకు మార్గదర్శిగా వ్యవహరించనుంది.

Advertisement

Next Story

Most Viewed