Praggnanandhaa : ప్రజ్ఞానంద మరో సంచలనం.. ఈ సారి వరల్డ్ చాంపియన్‌కు చెక్

by Harish |
Praggnanandhaa : ప్రజ్ఞానంద మరో సంచలనం.. ఈ సారి వరల్డ్ చాంపియన్‌కు చెక్
X

దిశ, స్పోర్ట్స్ : నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ నం.1 కార్ల్‌సన్, వరల్డ్ నం.2 ఫాబియానా కరువానాలకు షాకిచ్చిన అతను తాజాగా వరల్డ్ చాంపియన్ డింగ్ లిరెన్(చైనా)కు చెక్ పెట్టాడు. 7వ రౌండ్‌లో ఆర్మగెడాన్ గేమ్‌లో డింగ్ లిరెన్‌పై విజయం సాధించాడు. తెల్లపావులతో ఆడిన అతను కేవలం 23 ఎత్తుల్లోనే ప్రత్యర్థిని ఓడించాడు. అంతకుముందు 7వ రౌండ్‌లో ప్రజ్ఞానంద.. డింగ్ లిరెన్‌తో కలిసి డ్రా చేసుకున్నాడు.

మరో ఆర్మగెడాన్ గేమ్‌లో హికారు నకమురా(అమెరికా)పై కార్ల్‌సన్(నార్వే) విజయం సాధించగా.. అలిరెజా ఫిరౌజ్జా(ఫ్రాన్స్), ఫాబియానో కరువానా(అమెరికా) మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది. పాయింట్స్ టేబుల్‌లో 11 పాయింట్లతో ప్రజ్ఞానంద మూడో స్థానంలో ఉన్నాడు. కార్ల్‌సన్(13), నకమురా(12.5) తొలి, రెండు స్థానాల్లో ఉన్నారు. మరోవైపు, మహిళల విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి ఆరు గేమ్‌ల తర్వాత విజయాన్ని అందుకుంది. 7వ రౌండ్‌లో ఆమె సహచర క్రీడాకారిణి ఆర్.వైశాలిపై 36 ఎత్తుల్లో విజయం సాధించింది. వైశాలికి ఇది వరుసగా రెండో ఓటమి. పాయింట్స్ టేబుల్‌లో వైశాలి 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. కోనేరు హంపి(8) 5వ స్థానంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed