పారా షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో నాలుగు పతకాలు

by Harish |
పారా షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో నాలుగు పతకాలు
X

దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీలో జరుగుతున్న పారా షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో నాలుగు పతకాలు చేరాయి. ఆర్10 మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్ టీమ్ ఈవెంట్‌లో మోనా అగర్వాల్-ఆదిత్య గిరి జంట రజత పతకం సాధించింది. ఫైనల్‌లో భారత జోడీ 4-16 తేడాతో చైనాకు చెందిన జాంగ్ యిక్సిన్-డాంగ్ చావో చేతిలో ఓడి రెండో స్థానంతో సరిపెట్టింది. ఈ టోర్నీలో మోనా అగర్వాల్‌కు ఇది రెండో పతకం. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌ఎచ్1 కేటగిరీలో స్వర్ణం గెలుచుకున్న విషయం తెలిసిందే.

పీ6 మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో మనీశ్ నర్వాల్-రుబినా ప్రాన్సిస్ ఫైనల్‌లో ఓడి సిల్వర్ మెడల్‌తో టోర్నీని ముగించింది. ఇదే కేటగిరీలో మరో భారత ద్వయం భక్తి శర్మ-రుద్రాన్ష్ జోడీ 16-8 తేడాతో క్యూబా జంటను ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది. ఆర్11 మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్2 టీమ్ ఈవెంట్‌లో బానోత్ పావని-రాయల సత్యజనార్ధన జోడీ కూడా కాంస్య పతకం దక్కించుకుంది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో భారత ద్వయం 17-15 తేడాతో న్యూజిలాండ్ జోడీని ఓడించింది.

Advertisement

Next Story