బంగ్లా చేతిలో ఘోర ఓటమి.. బాధలో ఉన్న పాక్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ

by Harish |
బంగ్లా చేతిలో ఘోర ఓటమి.. బాధలో ఉన్న పాక్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ చేతిలో ఘోర ఓటమి పాలై బాధలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్లతోపాటు మ్యాచ్ ఫీజులో కోత పెట్టింది. తొలి టెస్టులో పాక్ స్లో ఓవర్ రేట్‌ను నిబంధనను ఉల్లంఘించడమే కారణం. ‘పాక్ ఆరు ఓవర్లు తక్కువగా వేసినట్టు తేలింది. కాబట్టి, డబ్ల్యూటీసీ పాయింట్లలో ఆరు పాయింట్లను కోల్పోయింది. అలాగే, మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా పడింది.’ అని ఐసీసీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

బంగ్లాదేశ్ కూడా మూడు ఓవర్లు తక్కువ వేయడంతో ఆ జట్టు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతపెట్టినట్టు పేర్కొంది. తొలి టెస్టు అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో బంగ్లా రెండు స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకోగా.. పాక్ 8వ ర్యాంక్‌కు పడిపోయింది. ఐసీసీ పాయింట్ల కోతతో బంగ్లా(21 పాయింట్లు, 35 శాతం), పాక్(16 పాయింట్లు 22.22 శాతం) జట్లు ర్యాంక్‌లను కాపాడుకున్నప్పటికీ పాయింట్స్, పర్సంటేజ్ పాయింట్స్‌లను కోల్పోయాయి.

మరోవైపు, బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు ఐసీసీ జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్ 1ను ఉల్లంఘించినందుకు అతనికి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతపెట్టింది. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్ వేయడానికి వచ్చిన షకీబ్.. బ్యాటర్ రిజ్వాన్ క్రీజులో సిద్ధంగా లేకపోవడంతో అసహనానికి గురై అతని వైపు బంతిని విసిరాడు. షకీబ్‌కు అంపైర్ వార్నింగ్ ఇవ్వగా అతనితో కాసేపు వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ షకీబ్‌కు జరిమానా విధించినట్టు తెలుస్తోంది. కాగా, ఆ మ్యాచ్‌లో 10 వికెట్లతో తేడాతో గెలుపొందిన బంగ్లా.. పాక్‌పై తొలి టెస్టు విజయాన్ని అందుకుంది.

Advertisement

Next Story

Most Viewed