ఎక్లాస్ పూర్ తిమ్మప్ప గుట్ట ఎకో పార్కు వద్ధ చిరుత పులి సంచారం

by Y. Venkata Narasimha Reddy |
ఎక్లాస్ పూర్ తిమ్మప్ప గుట్ట ఎకో పార్కు వద్ధ చిరుత పులి సంచారం
X

దిశ, వెబ్ డెస్క్ : నారాయణపేట జిల్లా కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలోని ఎక్లాస్‌పూర్‌ కొండపై తిమ్మప్ప(వెంకటేశ్వర స్వామి) ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఎకో పార్కు వద్ధ చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. పార్కు గేటు ద్వారంపై సిమెంట్ తో నిర్మించిన చిరుత పులి బొమ్మ దగ్గరికి ఓ చిరుత నిత్యం వచ్చిపోతుంది. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అవ్వగా అవి వైరల్ గా మారాయి. సమీప అడవుల్లోంచి ఆ చిరుత నిత్యం వస్తున్నట్లుగా గమనించారు. పార్కు స్వాగత గేటుపై ఉన్న చిరుత పులి బొమ్మను నిజమైన చిరుతగా భ్రమించి దాని వద్దకు వచ్చి వెలుతున్నట్లుగా అటవీ అధికారులు భావిస్తున్నారు. చిరుత ఎకో పార్కుకు వచ్చే సందర్శకులపై దాడి చేసే అవకాశమున్నందునా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే గేటుపై ఉన్న చిరుత పులి బొమ్మ వద్దకు చిరుత నిత్యం వచ్చి వెలుతున్న దృశ్యాలను చూసిన నెటిజన్లు బహుశా ఆ చిరుత తోడు కోసం వెతుక్కునే క్రమంలో నిజమైన చిరుతగా భ్రమించి బొమ్మ చిరుత పులి వద్దకు వస్తుందేమోనంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

మీనాస్‌పూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని ఎక్లాస్‌పూర్‌ కొండల్లో గల 200 ఎకరాల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్‌ బ్లాక్‌ నంబర్‌ 409, 410లో ఎకో పార్కును ఏర్పాటు చేసి ఏడాది క్రితం ప్రారంభించారు. ఇక్కడ క్లాస్‌పూర్‌ కొండపై వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుండగా, మరోవైపు ఆలయం వెనుక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి పార్కును ఏర్పాటు చేశారు. రూ.3 కోట్ల వ్యయంతో గుట్టల మధ్య ఎకో పార్కు ఏర్పాటు చేశారు. రకరకాల ఔషధ మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed