రోడ్డెక్కిన సెవెంత్ బెటాలియన్ కుటుంబాలు..

by Sumithra |
రోడ్డెక్కిన సెవెంత్ బెటాలియన్ కుటుంబాలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని సెవెంత్ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు తమ సమస్యల పరిష్కారం కోసం గురువారం రోడ్డెక్కారు. కొద్ది రోజులుగా లోలోపల రగులుతున్న సమస్యల ఆందోళన గురువారం ఉన్నపళంగా రోడ్డెక్కింది. ఏడో బెటాలియన్ ఎదుట 44 వ నెంబరు జాతీయ రహదారి పై బెటాలియన్ పోలీసు కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. పోలీసు ఉద్యోగాల్లో కొనసాగుతున్న తమ కుటుంబ సభ్యులు రోజుకు ఎనిమిది గంటలకు మించి పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఐదేళ్లు ఒకే దగ్గర పని చేసేలా పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎక్కువ కాలం ఓకే దగ్గర పని చేసే అవకాశం లేకుండా తరచూ పోస్టింగులు మార్చుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. దీంతో తమ పిల్లల చదువులకు కూడా ఆటంకం కలుగుతోందన్నారు. పెద్ద మనసుతో తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సెవెంత్ బెటాలియన్ కమాండెంటెంట్ ఆందోళన చేస్తున్న బెటాలియన్ పోలీసు కుటుంబ సభ్యులతో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

సెవెంత్ బెటాలియన్ ఎదుట జాతీయ రహదారి పై రాస్తారోకో చేస్తున్న వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. హైదారాబాద్ నుండి ఆదిలాబాద్ కు వెళ్తున్న కేటీఆర్ మధ్యలో బెటాలియన్ వద్ద ఆందోళన చేస్తున్న వారిని చూసి ఆగి బాధితులతో మాట్లాడారు. బెటాలియన్ పోలీసులుగా పనిచేస్తున్న తమ భర్తలను ఇష్టారీతిన బదిలీలు చేస్తున్నారని, తరచూ పోస్టింగులు మారుస్తూ ఉండటంతో పిల్లల చదువులకు, తమ కుటుంబాలకు ఇతరత్రా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని బాధితులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల సమస్యలు విన్న కేటీఆర్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా ప్రయత్నిస్తానని చెప్పారు. కేటీఆర్ వెంట హుజూరాబాద్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బాల్క సుమన్, జాజుల సురేందర్, వీజీ గౌడ్, తదితరులున్నారు.

Advertisement

Next Story

Most Viewed