న్యాయం చేయండి.. మహిళా రెజ్లర్లుకు మద్దతుగా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్

by Vinod kumar |   ( Updated:2023-04-29 14:53:21.0  )
న్యాయం చేయండి.. మహిళా రెజ్లర్లుకు మద్దతుగా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీకి చెందిన లోక్‌సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో భారత మహిళా రెజ్లర్లు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. అయితే రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా వ్యవహరిస్తోన్న బ్రిజ్ భూషణ్‌పై సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా బీజేపీ అధినాయకత్వం ముందుకు రావట్లేదు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. బ్రిజ్ భూషణ్ ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ లోక్‌సభకు ప్రాతినిథ్యాన్నివహిస్తోన్నారు. వరుసగా మూడుసార్లు ఆయన ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనను రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నామినేట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు బ్రిజ్ భూషణ్‌పై వెల్లువెత్తాయి. తక్షణ చర్యలు తీసుకోవాలంటూ భారత మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. రోజుల తరబడి నిరసన కొనసాగిస్తోన్నారు.

ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపడానికి జనవరిలో మేరీకోమ్ సారథ్యంలో అయిదుమంది సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది. నాలుగు వారాల్లోగా నివేదికను అందించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి కాకపోవడంతో.. మరోసారి నిరసన దీక్షలకు దిగారు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద బైఠాయించారు. వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్‌వీర్ రాఠీ, జితేందర్ కిన్హా తమ నిరసనలను కొనసాగిస్తోన్నారు. వారి నిరసన దీక్షలకు క్రమంగా మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది.

తాజాగా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా కూడా నిరసనకారులకు మద్దతు తెలిపారు. తన ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటించి.. రెజ్లర్లకు అండగా నిలిచారు. న్యాయం కోసం తన తోటి అథ్లెట్లు రోడ్డెక్కడం కలచి వేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ భారతదేశం గర్వించేలా ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ స్థాయిలో పతకాలను గెలిచిన అథ్లెట్లు న్యాయం కోసం పోరుబాట పట్టడం బాధాకరమని పేర్కొన్నారు. అథ్లెట్లకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ రక్షణ, భద్రతను కల్పించాల్సిన బాధ్యత ఈ దేశంపై ఉందని గుర్తు చేశారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల వంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇదొక సున్నితమైన అంశమని, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తక్షణమే ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. ఈ అంశం సుప్రీంకోర్టుకు కూడా చేరింది.

Advertisement

Next Story

Most Viewed