రసవత్తరంగా సాగిన కివీస్, ఆసిస్ తొలి టీ20.. ఆఖరి బంతికి ఆస్ట్రేలియా గెలుపు

by Harish |
రసవత్తరంగా సాగిన కివీస్, ఆసిస్ తొలి టీ20.. ఆఖరి బంతికి ఆస్ట్రేలియా గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. వెల్లింగ్టన్‌లో బుధవారం జరిగిన తొలి టీ20లో కివీస్‌ను 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి విజయం ఆసిస్‌ను వరించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 215 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర(68), కాన్వే(63) హాఫ్ సెంచరీలతో మెరిసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఫిన్ అలెన్(32) విలువైన పరుగులు జోడించాడు. గ్లెన్ ఫిలిప్స్(19 నాటౌట్), చాప్‌మెన్(18 నాటౌట్) నాలుగో వికెట్‌కు అజేయంగా కీలకమైన 41 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో ఆసిస్ ముందు న్యూజిలాండ్ 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసిస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్, మిచెల్ మార్ష్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 216 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(24), డేవిడ్ వార్నర్(32) దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లు పారేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ మిచెల్ మార్ష్ జట్టుకు అండగా నిలిచాడు. దూకుడుగా ఆడిన అతను 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(25), జోష్ ఇంగ్లిష్(20) క్రీజులో నిలువలేకపోయారు. ఆ తర్వాత మిచెల్ మార్ష్‌కు టిమ్ డేవిడ్ దూకుడు తోడవడంతో జట్టు పోటీలోకి వచ్చింది. చివరి ఓవర్‌లో విజయానికి 16 పరుగులు అవసరమవ్వడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఐదు బంతుల్లో 12 పరుగులు రాగా.. ఆఖరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి వచ్చింది. చివరి బంతిని టిమ్ డేవిడ్ ఫోర్ కొట్టడంతో కంగారుల విజయం లాంఛనమైంది. మిచెల్ మార్ష్ 44 బంతుల్లో 72 పరుగులతో, టిమ్ డేవిడ్ 10 బంతుల్లో 31 పరుగులతో అజేయంగా నిలిచారు. కివీస్ బౌలర్లలో సాంట్నర్‌ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ మిల్నే, ఫెర్గూసన్‌‌లకు తలా ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. శుక్రవారం రెండో టీ20 జరగనుంది.


Advertisement

Next Story