రెండో టీ20లోనూ పాక్ చిత్తు.. సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి కివీస్

by Harish |
రెండో టీ20లోనూ పాక్ చిత్తు.. సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి కివీస్
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. డునెడిన్ వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో రెండు ఇన్నింగ్స్‌లను 15 ఓవర్లకు కుదించి మ్యాచ్ నిర్వహించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 రన్స్ చేసింది. కివీస్ బౌలర్లు జాకబ్ డఫీ, బెన్ సియర్స్, నీషమ్, ఇష్ సోధి రెండేసి వికెట్లతో సమిష్టిగా రాణించి పాక్‌ను దెబ్బకొట్టారు. అయితే, కెప్టెన్ సల్మాన్ అఘా(46) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. షాదాబ్ ఖాన్(26), షాహీన్ అఫ్రిది(22 నాటౌట్) విలువైన రన్స్ జోడించడంతో పోరాడే స్కోరు దక్కింది.

ఇక, లక్ష్యాన్ని న్యూజిలాండ్ బ్యాటర్లు అలవోకగానే ఛేదించారు. ఓపెనర్లు టిమ్ సిఫెర్ట్(45), ఫిన్ అలెన్(38) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కివీస్ విజయాన్ని తేలిక చేశారు. వీరు అవుటైన తర్వాత కొద్దిగా తడబడినా.. మిచెల్ హే(21 నాటౌట్) మిగతా పని పూర్తి చేశాడు. దీంతో న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. వరుసగా రెండో విజయంతో ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. శుక్రవారం మూడో టీ20 జరగనుంది. అందులోనూ నెగ్గితే సిరీస్ కివీస్ వశమవుతుంది.


Next Story