ఆఖరి ఓవర్‌లో నేపాల్‌కు షాకిచ్చిన నెదర్లాండ్స్.. ట్రై సిరీస్ కైవసం

by Harish |
ఆఖరి ఓవర్‌లో నేపాల్‌కు షాకిచ్చిన నెదర్లాండ్స్.. ట్రై సిరీస్ కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య నేపాల్, నమీబియాలతో జరిగిన టీ20 ట్రై సిరీస్‌లో నెదర్లాండ్స్ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో నేపాల్‌పై 4 వికెట్ల తేడాతో డచ్ జట్టు గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 185 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ 6 వికెట్లను కోల్పోయి ఛేదించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 184 పరుగులు చేసింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్(47) రాణించగా.. గుల్సన్ ఝా(34), కుషాల్ మల్లా(26), కెప్టెన్ రోహిత్ పాడెల్(25) కీలక పరుగులు జోడించారు. డచ్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్, వాన్ డెర్ గుగ్టెన్, మైఖేల్ లెవిట్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ రెండేసి వికెట్లతో సమిష్టిగా రాణించారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 185 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో పూర్తి చేసింది. 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. మైఖేల్ లెవిట్(54) మెరుపు హాఫ్ సెంచరీతో అదిరిపోయే శుభారంభం అందించాడు. అయితే, నేపాల్ బౌలర్లు మరోవైపు వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. ఈ పరిస్థితుల్లో సింబ్రాడ్ ఎంగెల్‌బ్రెచ్ట్(48), వాన్ డెర్ గుగ్టెన్(21 నాటౌట్) మెరుపులతో జట్టు విజయతీరాలకు చేరింది. చివరి మూడు ఓవర్లలో విజయానికి 40 పరుగులు అవసరమైన సమయంలో వీరిద్దరూ బ్యాటు ఝుళిపించారు. ఇక, ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు కావాల్సి ఉండగా వాన్ డెర్ గుగ్టెన్ వరుసగా ఫోర్, కొట్టి జట్టును గెలిపించాడు. నేపాల్ బౌలర్లలో కుషాల్ మల్లా 4 వికెట్లతో సత్తాచాటాడు.

Advertisement

Next Story