జై షా శకం మొదలు.. ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

by Harish |
జై షా శకం మొదలు.. ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్‌గా బీసీసీఐ సెక్రెటరీ జై షా శకం మొదలైంది. ఆదివారం ఐసీసీ చైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 1 నుంచి ఆయన పదవీ కాలం ప్రారంభమైందని ఐసీసీ వెల్లడించింది. ఆగస్టులో ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.ఇంతకుముందు ఐసీసీ చైర్మన్‌గా ఉన్న జార్జీ బార్క్‌లే పదవీకాలం శనివారంతో ముగిసింది. దీంతో జై షా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. బోర్డు డైరెక్టర్లు అంగీకరిస్తే మరో రెండేళ్లపాటు పొడిగింపు ఉంటుంది.

‘ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు గౌరవంగా భావిస్తున్నా. ఐసీసీ డైరెక్టర్లకు, సభ్య దేశాల బోర్డుల మద్దతుకు కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు మంచి ఆదరణ ఉన్నది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఐసీసీ బృందం, సభ్యదేశాల సహకారంతో క్రీడను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి కృషి చేస్తా. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌‌నునిర్వహించడం అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒక్కటి.’ అని జై షా తెలిపారు.

అలాగే, క్రికెట్ అత్యున్నత బోర్డుకు అధ్యక్షుడిగా సేవలందించనున్న ఐదో భారతీయుడిగా జై షా నిలిచారు. గతంలో భారత్ నుంచి జగన్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా ఉన్నారు. ఐసీసీ చైర్మన్‌ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగానూ జై షా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జై షా బీసీసీఐ సెక్రెటరీగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆ రెండు పదవులకు ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed