Sambhal: ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి 1857 నాటి మెట్ల బావి

by Shamantha N |
Sambhal: ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి 1857 నాటి మెట్ల బావి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లోని సంభాల్(Sambhal) లో 1857 నాటి మెట్ల బావి బయటపడింది. పురాతనవస్తు శాఖ అధికారులు(ASI) సంభాల్ లో సర్వే నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే పురాతన హిందూ ఆలయాలు, బావులు బయటపడ్డాయి. కాగా.. శనివారం సర్వే చేస్తుండగా సంభాల్ లోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతంలో(Laxman Ganj area) ‘‘మెట్ల బావి’’ వెలుగులోకి వచ్చింది. 1857 తిరుగుబాటు కాలం నాటి 250 అడుగుల లోతున్న మెట్ల బావిని(Stepwell) కనుగొన్నారు. నివేదిక ప్రకారం.. ఈ నెల ప్రారంభంలో అదే ప్రాంతంలో పురాతన బంకే బిహారీ ఆలయ శిథిలాలను కొనుగొన్నారు. కాగా.. ఇప్పుడు ‘‘రాణీ కీ బావడి’’(Rani ki Bawdi) అనే మెట్ల బావిని కనుగొన్నారు. లక్ష్మణ్ గంజ్‌లో సహస్‌పూర్ రాజకుటుంబం ఉండేదని, అక్కడ మెట్ల బావి కూడా ఉందని సనాతన్ సేవక్ సంఘ్ రాష్ట్ర పబ్లిసిటీ చీఫ్ కౌశల్ కిషోర్ సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) రాజేంద్ర పెన్సియాకు లేఖ రాశారు. దీంతో, ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సంభాల్ లో తవ్వకాలు

స్థానికుల సూచనలతో సంభాల్ డీఎం లక్ష్మణ్ గంజ్‌లోని స్థలంలో తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. ఆపరేషన్‌లో రెండు బుల్‌డోజర్‌లను వాడారు. దీంతో, మెట్ల బావి బయటపడింది. 400 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న బావిని కనుగొన్నట్లు డీఎం వెల్లడించారు. చుట్టూ నాలుగు గదులు ఉన్న ఈ నిర్మాణంలో పాలరాతితో చేసిన కొన్ని అంతస్తులు ఉన్నాయని తెలిపారు. మెట్ల బావి ఉన్న స్థలాన్ని ఆక్రమించిన కుటుంబాలకు నోటీసులిచ్చి తొలగిస్తామని డీఎం తెలిపారు. ఇకపోతే, శుక్రవారం భారత పురావస్తు శాఖ(ASI) సంభాల్‌లోని కార్తికేయ ఆలయంలో కార్బన్ డేటింగ్ నిర్వహించింది. 46 ఏళ్ల తర్వాత డిసెంబర్ 13న ఈ ఆలయాన్ని తిరిగి తెరిచారు. 1978 మత అల్లర్ల తర్వాత ఈ ప్రాంతం నుంచి హిందువులు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆలయం మూసేసి ఉంది. దీంతో పాటు భద్రక్ ఆశ్రమం, స్వర్గ్‌దీప్, చక్రపాణి సహా పరిసర ప్రాంతాల్లోని ఐదు పుణ్యక్షేత్రాలను పరిశీలించడంతో పాటు 19 బావుల్ని సర్వే చేశారు. అయితే, సంభాల్‌లో ఘర్షణలు చెలరేగిన షాహీ ఈద్గా మ‌సీదుకు సమీపంలోనే ఈ ఆలయాలు, బావి ఉండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed