Paris olympics : మద్యపానం, ధూమపానం.. లక్ష్యానికీ చేటే.. జపాన్ అథ్లెట్‌పై వేటు

by Harish |
Paris olympics : మద్యపానం, ధూమపానం.. లక్ష్యానికీ చేటే.. జపాన్ అథ్లెట్‌పై వేటు
X

దిశ, స్పోర్ట్స్ : మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఆల్కహాల్, స్మోకింగ్ ఆరోగ్యానికే కాదు లక్ష్యానికి కూడా చేటు చేస్తుందని జపాన్ అథ్లెట్ షోకో మియాటా విషయంలో తేలింది. ఒలింపిక్స్‌లో ఒక్కసారైనా పాల్గొని పతకం సాధించాలని ప్రతి అథ్లెట్ కోరిక. 19 ఏళ్ల జపాన్ జిమ్నాస్ట్ షోకో కూడా అదే కల కనింది. ఎంతో కష్టపడి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. కానీ, విశ్వక్రీడలకు ముందు ఆమె కల చెదిరింది. పారిస్ ఒలింపిక్స్ జట్టు నుంచి ఆమెను తప్పించారు. ఎందుకంటే, స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ సేవించడమే అందుకు కారణం. ఈ విషయాన్ని జపాన్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్(జేజీఏ) శుక్రవారం వెల్లడించింది.

జట్టు ప్రవర్తనా నియామవళిని షోకో మియాటా ఉల్లంఘించినట్టు పేర్కొంది. జపాన్ జిమ్నాస్టిక్స్ మహిళల టీమ్‌కు మియాటా కెప్టెన్‌గా ఎంపికైంది. గురువారమే మియాటా జపాన్‌కు చేరుకుంది. అయితే, మొనాకోలో నిర్వహించిన ట్రైనింగ్ క్యాంప్‌లో ఆమె స్మోకింగ్‌తోపాటు మద్యం సేవించినట్టు తేలింది. దీంతో జేజీఏ ఆమెపై వేటు వేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఐదుగురికి బదులు మహిళల జట్టు నలుగురితోనే బరిలోకి దిగుతుందని తెలిపింది. దేశ ప్రజలకు క్షమాపణలు తెలిపింది. కాగా, 1964లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్ మహిళల జిమ్నాస్టిక్స్ జట్టు కాంస్యం నెగ్గింది. ఆ తర్వాత మరోసారి పతకం సాధించలేదు.

Advertisement

Next Story

Most Viewed