సెమీస్‌కు దూసుకెళ్లిన భారత అమ్మాయిలు..

by Vinod kumar |
సెమీస్‌కు దూసుకెళ్లిన భారత అమ్మాయిలు..
X

కకమిగహర: ఉమెన్స్ జూనియర్ హాకీ ఆసియా కప్‌లో భారత అమ్మాయిలు సెమీస్‌కు దూసుకెళ్లారు. జపాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం పూల్-ఏలో భాగంగా జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో భారత్ 11-0 తేడాతో చైనీస్ తైపీ జట్టుపై విజయం సాధించింది. దాంతో టీమ్ ఇండియా 10 పాయింట్లతో భారత్ గ్రూపు-ఏ నుంచి అగ్రస్థానంతో సెమీస్‌లో అడుగపెట్టింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి చివరి వరకూ పూర్తిగా టీమ్ ఇండియా ఆధిపత్యమే కొనసాగింది. తొలి నిమిషంలోనే వైష్ణవి ఫీల్డ్‌ గోల్‌తో భారత్ ఖాతా తెరవగా.. 2వ నిమిషంలో దీపక్, 9వ నిమిషంలో అన్ను, 11వ నిమిషంలో రుతాజ చెరో గోల్ అందించడంతో తొలి క్వార్టర్‌లోనే టీమ్ ఇండియా 4-0తో ఆధిపత్యం ప్రదర్శించింది.

రెండో క్వార్టర్‌లో నీలమ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో ఫస్టాఫ్‌ను 5-0తో ముగించిన భారత్.. స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చి చైనీస్ తైపీని ఒత్తిడిలోకి నెట్టింది. ఆ తర్వాత కూడా భారత్ దూకుడు అలాగే కొనసాగింది. మూడో క్వార్టర్‌లో మంజు(32వ నిమిషం), సునేలిత టొప్పో(42) చెరో గోల్ చేయగా.. చివరి క్వార్టర్‌లో దీపిక సొరెంగ్(45), ముంతాజ్(54)తోపాటు అన్ను(51), సునేలిత టొప్పో(56) తమ నుంచి జట్టుకు రెండో గోల్ అందించారు. పూర్తిగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 11-0 తేడాతో గెలుపొందింది. దాంతో భారత్ వరుసగా రెండోసారి నాకౌట్‌గా చేరుకోగా.. మొత్తంగా సెమీస్‌కు వెళ్లడం ఇది 7వ సారి. పూల్-‌ఏలో భారత్ 3 విజయాలు, ఒక డ్రాతో 10 పాయింట్లు సాధించింది. సెమీస్‌లో భారత్ ఆతిథ్య జపాన్ లేదా కజకస్తాన్‌తో తలపడనున్నది.

Advertisement

Next Story