Women's Asia Cup : నేపాల్‌పై భారత్ భారీ విజయం.. సెమీస్‌కు క్వాలిఫై

by Harish |
Womens Asia Cup : నేపాల్‌పై భారత్ భారీ విజయం.. సెమీస్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు‌కు ఎదురులేకుండా పోయింది. హ్యాట్రిక్ విజయం సాధించడంతోపాటు సెమీస్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో నేపాల్‌‌పై 82 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు విశ్రాంతినివ్వగా.. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన భారత జట్టును నడిపించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 42 బంతుల్లో 81 పరుగులు చేసింది. మరో ఓపెనర్ హేమలత(47) రాణించగా.. రోడ్రిగ్స్(28 నాటౌట్) ఆఖర్లో మెరిసింది.

అనంతరం ఛేదనకు దిగిన నేపాల్‌ బ్యాటర్లు భారత బౌలింగ్ ముందు తేలిపోయారు. నిర్ణీత ఓవర్లలో నేపాల్ 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులకే పరిమితమైంది. నేపాల్ జట్టులో ఒక్కరు కూడా 20 పరుగుల చేయలేకపోయారు. సీతా రాణా మగర్(18) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ రెండేసి వికెట్లతో రాణించగా.. రేణుకకు ఒక్క వికెట్ దక్కింది. బ్యాటుతో మెరుపులు మెరిపించిన షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Advertisement

Next Story