IND vs AUS: తెలుగోడికి ఛాన్స్.. అతడు డౌట్.. ఆసీస్‌తో తొలి వన్డే ఆడే భారత జట్టు ఇదే!

by Vinod kumar |   ( Updated:2023-09-20 10:57:19.0  )
IND vs AUS: తెలుగోడికి ఛాన్స్.. అతడు డౌట్.. ఆసీస్‌తో తొలి వన్డే ఆడే భారత జట్టు ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్ 2023 టైటిల్ గెలిచి జోష్‌లో ఉన్న టీమిండియా మరో ఆసక్తికర సిరీస్‌కు సిద్దమైంది. వన్డే ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా శుక్రవారం జరిగే తొలి వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు సీనియర్ ఆటగాళ్లను టీమిండియా మేనేజ్‌మెంట్ దూరం పెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్ పటేల్‌లకు విశ్రాంతినిచ్చింది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకున్న టీమ్‌ మేనేజ్‌మెంట్.. వాషింగ్టన్ సుందర్‌తో పాటు బెంచ్ ఆటగాళ్లందరినీ తొలి రెండు వన్డేలకు ఎంపిక చేసింది.

తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనున్నాడు. మూడో వన్డేతో సీనియర్ ఆటగాళ్లంతా తిరిగి రానున్నారు. శుక్రవారం జరిగే తొలి వన్డేలో బరిలోకి దిగే భారత తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్లకే ప్రథమ ప్రాధాన్యత లభించనుంది. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా లేకపోతే మాత్రం రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇషాన్ కిషన్ నాలుగో స్థానంలో ఆడనున్నాడు. అయ్యర్ ఫిట్‌గా ఉంటే మాత్రం ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. నాలుగో స్థానంలో తిలక్ వర్మ ఆడనుండగా.. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్, ఆరో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అశ్విన్ ఆడనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పేసర్లుగా మహహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా బరిలోకి దిగనున్నారు.

భారత తుది జట్టు(అంచనా):

శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్/రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా

Advertisement

Next Story

Most Viewed