సంపాదన కోసం కాదు...సేవ చేసేందుకు వచ్చా

by Sridhar Babu |
సంపాదన కోసం కాదు...సేవ చేసేందుకు వచ్చా
X

దిశ, చెన్నూర్ : గత పాలకులలాగా అక్రమంగా సంపాదించడం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయడం కోసమే వచ్చానని స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో గల నాలుగవ వార్డులో రూ. 62.90 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా పలు వార్డుల్లో తిరిగినప్పుడు చాలామంది ప్రజలు తమ సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీలు బాగా లేవని, వాటిని తొందరగా నిర్మించాలని కోరినట్టు పేర్కొన్నారు. దాంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు.

రూ.100 కోట్లతో జాతీయ రహదారి అభివృద్ధితో పాటు జోడువాగుల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని, రూ.125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ బిల్డింగ్ కు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. అంబేద్కర్ భవనానికి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో నియోజకవర్గంలోని ఎంతోమంది రైతులకు పంటనష్టం వాటిల్లిందని, వారికి నష్టపరిహారం చెల్లించాలని మంత్రితో మాట్లాడానని చెప్పారు. పంటనష్టాన్ని అంచనా వేయాలని కలెక్టర్​కు ఆదేశాలు జారీ చేశానని, కోటపల్లి మండలంలో అంబులెన్స్ అవసరం ఉందని తన దృష్టికి వచ్చిందని రెండు అంబులెన్స్​లను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.

ఇసుక మాఫియా, అక్రమ పేకాట క్లబ్ లు, భూ దందాలు నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మత్తడి పేల్చివేత కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని, దోషులను గుర్తించడంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, పట్టణంలోని ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చడానికి అమృత్ పథకం ద్వారా రూ.30 కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed