బంతి బ్యాట్‌ను తాకిందా?.. ప్యాడ్‌‌నా?.. కేఎల్ రాహుల్ క్యాచ్ ఔట్ వివాదాస్పదం

by Harish |
బంతి బ్యాట్‌ను తాకిందా?.. ప్యాడ్‌‌నా?.. కేఎల్ రాహుల్ క్యాచ్ ఔట్ వివాదాస్పదం
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టులో మొదటి రోజే థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. కేఎల్ రాహుల్‌(26) క్యాచ్ అవుటైన తీరు చర్చకు దారితీసింది. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం వల్లే రాహుల్ మైదానం వీడాల్సి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే..యశస్వి జైశ్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కేఎల్ రాహుల్ ఆసిస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. జైశ్వాల్(0), పడిక్కల్(0) నిరాశపరిచిన అదే పిచ్‌పై రాహుల్ మాత్రం నిదానంగా ఆడాడు. క్రీజులో పాతుకపోయాడనుకున్న తరుణంలో భారత్ అనూహ్యంగా అతని వికెట్ కోల్పోవాల్సి వచ్చింది.

స్టార్క్ వేసిన 23వ ఓవర్‌లో రెండో బంతిని రాహుల్ డిఫెండ్ చేయాలని చూశాడు. అది వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేతిలో పడింది. ఆసిస్ ప్లేయర్లు బంతి బ్యాట్‌కు తాకిందంటూ అప్పీలు చేశారు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. దీనిపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు డీఆర్ఎస్ తీసుకున్నారు. సమీక్షలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టత లేదు. అదే సమయంలో బ్యాటు మాత్రం ప్యాడ్‌కు తాకింది. దీంతో స్పైక్స్ వచ్చాయి. బంతి బ్యాట్‌కు తాకి స్పైక్స్ వచ్చాయా? లేదంటే బ్యాటు ప్యాడ్‌కు తాకి స్పైక్స్ వచ్చాయా? అన్న దానిపై స్పష్టత లేదు. రాహుల్ కూడా బంతి బ్యాటుకు తాకలేదనే చెప్పాడు. కానీ, థర్డ్ అంపైర్ మాత్రం రాహుల్ ఔట్ అయిట్టు ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమైంది. థర్డ్ అంపైర్ పూర్తిగా చెక్ చేయకుండానే నిర్ణయం తీసుకున్నాడని విమర్శలు వస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, వసీం జాఫర్ కూడా అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story