హైదరాబాద్‌ గ్లోబల్ లీడర్‌‌గా ఎదుగుతోంది : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

by M.Rajitha |
హైదరాబాద్‌ గ్లోబల్ లీడర్‌‌గా ఎదుగుతోంది : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్‌ గ్లోబల్ లీడర్‌‌గా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. శుక్రవారం గచ్చిబౌలీలో కామన్వెల్త్ మీడియేషన్ - ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్-2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, కానీ, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారిందన్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి, వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమన్నారు. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలని, అలా చేయడం వల్ల వివాదంలో చిక్కుకున్న ఇరువర్గలకూ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌‌ నిర్వాహకులను అభినందిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. మీడియేషన్, ఆర్బిట్రేషన్‌ను సమన్వయం చేస్తే సమస్యలు, వివాదాలను వీలైనంత వేగంగా పరిష్కరించొచ్చని, ఐఏఎంసీ అనేది తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని, దేశం మొత్తానికి ఈ సెంటర్‌‌ ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. ఐఏఎంసీ ని గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కు, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే పరిమితం చేయవద్దని, కామన్‌ మ్యాన్‌కు, చిన్న సంస్థలకు కూడా ఐఏఎంసీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లండన్, సింగపూర్ తర్వాత ఆర్బిట్రేషన్ మ్యాప్‌లో హైదరాబాద్ నగరం ఉండటం గర్వకారణమని, ఆర్బిట్రేషన్ సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావడంపై మరో సదస్సు నిర్వహించాలని కోరుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed