ఫ్రెంచ్ ఓపెన్ : ఎదురులేని స్వైటెక్.. సెమీస్‌కు దూసుకెళ్లిన వరల్డ్ నం.1

by Harish |
ఫ్రెంచ్ ఓపెన్ : ఎదురులేని స్వైటెక్.. సెమీస్‌కు దూసుకెళ్లిన వరల్డ్ నం.1
X

దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్, వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్ జోరు కొనసాగుతోంది. ఏకపక్ష విజయాలతో పోలాండ్ క్రీడాకారిణి టైటిల్ నిలబెట్టుకునే దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఆమె సెమీస్‌లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్వైటెక్ 6-0, 6-2 తేడాతో 5వ సీడ్, చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి వొండ్రూసోవా‌ను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో స్వైటెక్‌కు ప్రత్యర్థి నుంచి పోటీనే లేదు. కేవలం గంటా 2 నిమిషాల్లోనే రెండు సెట్లను గెలుచుకుంది. రెండు సెట్లలో వొండ్రూసోవా కేవలం రెండు గేమ్‌లే గెలిచిందంటే స్వైటెక్ దూకుడు అర్థం చేసుకోవచ్చు. ఆమె ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసింది. గతేడాది వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన వొండ్రూసోవ్ కనీసం పోటీ ఇవ్వలేకపోవడం గమనార్హం. స్వైటెక్ 25 విన్నర్లు కొడితే.. ప్రత్యర్థి 12 మాత్రమే బాదింది. మరోవైపు, అమెరికా క్రీడాకారిణి కోకా గాఫ్ కూడా సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్‌ల్ ఆమె 4-6, 6-2, 6-3 తేడాతో 8వ సీడ్, ఒన్స్ జాబెర్(ట్యూనీషియా)‌పై గెలుపొందింది. తొలి సెట్ కోల్పోయిన గాఫ్.. ఆ తర్వాత బలంగా పుంజుకుని మిగతా రెండు సెట్లను దక్కించుకుంది. గురువారం స్వైటెక్, కోకా గాఫ్‌ల మధ్య సెమీస్ జరగనుంది.

సెమీస్‌కు సిన్నర్

మెన్స్ సింగిల్స్‌లో 2వ సీడ్ జెన్నిక్ సిన్నర్(ఇటలీ) వరుస విజయాలతో దూకుడు మీద ఉన్నాడు. క్వార్టర్స్‌ను దాటి సెమీస్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సిన్నర్ 6-2, 6-4, 7-6(7-3) తేడాతో 10వ సీడ్ డిమిత్రోవ్(బల్గేరియా)పై గెలిచాడు. సిన్నర్ 8 ఏస్‌లు, 29 విన్నర్లతో విరుచుకపడ్డాడు. మరోవైపు, ఐదు డబుల్ ఫౌల్ట్స్, 49 అనవసర తప్పిదాలతో డిమిత్రోవ్ మూల్యం చెల్లించుకున్నాడు. 5వ సీడ్ జ్వెరెవ్(జర్మనీ) కష్టంగా నాలుగో రౌండ్‌ను దాటి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. నాలుగో రౌండ్‌లో 13 సీడ్ రూనె(డెన్మార్క్)‌పై 4-6, 6-1, 5-7, 7-6(7-2), 6-2 తేడాతో జ్వెరెవ్ పోరాడి గెలిచాడు. 4 గంటలకుపైగా రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో జ్వెరెవ్ వరుసగా నాలుగు, ఐదు సెట్లను నెగ్గి విజయం లాంఛనం చేసుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed