ఆ అవార్డు అతనిదే.. 2023 కమిన్స్ నామసంవత్సరం

by Swamyn |
ఆ అవార్డు అతనిదే.. 2023 కమిన్స్ నామసంవత్సరం
X

దిశ, స్పోర్ట్స్ : 2023లో లక్కీయెస్ట్ క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే నెటిజన్లు చెబుతున్న పేరు ఒకటే.. అతనే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌. గతేడాది అతను పట్టిందల్లా బంగారమే అయ్యింది. తాజాగా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అతన్నే వరించింది. 2023కు సంబంధించి మేటి క్రికెటర్‌గా కమిన్స్ నిలిచినట్టు ఐసీసీ గురువారం ప్రకటించింది. దీంతో ప్రతిష్టాత్మక సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అందుకోనున్నాడు. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సహచరుడు ట్రావిస్ హెడ్‌ అవార్డు రేసులో నిలువగా.. వారిని అధిగమించి కమిన్స్ అవార్డు దక్కించుకున్నాడు. 2023లో కమిన్స్ ఇటు కెప్టెన్‌గా, అటు ప్లేయర్‌గా సత్తాచాటాడు. యాషెస్ సిరీస్‌ టైటిల్‌ను నిలబెట్టాడు. అతని నాయకత్వంలోనే ఆసిస్‌ తొలిసారిగా వరల్డ్ టెస్టు చాంపియన్‌గా అవతరించింది. 6వ సారి వన్డే వరల్డ్ కప్ సాధించిపెట్టాడు. ఇటీవల డిసెంబర్ నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అలాగే, ఆటగాడిగానూ అతను అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 24 మ్యాచ్‌ల్లో 59 వికెట్లతోపాటు 422 పరుగులు చేశాడు.


Advertisement

Next Story

Most Viewed