దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు యుకీ బాంబ్రీ జోడీ

by Harish |
దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు యుకీ బాంబ్రీ జోడీ
X

దిశ, స్పోర్ట్స్ : దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ పురుషుల డబుల్స్‌లో సెమీస్‌కు చేరుకున్నాడు. నెదర్లాండ్స్‌కు చెందిన రాబిన్ హాస్‌తో కలిసి గురువారం సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో యుకీ బాంబ్రీ జోడీ 6-4, 7-6(7-1) తేడాతో తమ కంటే మెరుగైన ర్యాంక్‌లు కలిగి జామీ ముర్రె(ఇంగ్లాండ్)-మైఖేల్ వీనస్(న్యూజిలాండ్) జోడీపై విజయం సాధించింది. గంటా 22 నిమిషాలపాటు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌ను యుకీ బాంబ్రీ జోడీ వరుస సెట్లలో గెలుచుకుంది. రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో నెగ్గి ప్రత్యర్థి జోడీ కథ ముగించింది. ఏటీపీ 500 టూర్ టోర్నీలో పురుషుల డబుల్స్‌లో యుకీ బాంబ్రీ సెమీస్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి. నేడు సెమీస్‌లో 2వ సీడ్ అస్టిన్ క్రాజిసెక్(అమెరికా)-ఇవాన్ డొడిగ్(క్రొయేషియా) జంటను యుకీ బాంబ్రీ జోడీ ఎదుర్కోనుంది. మరోవైపు, టాప్ సీడ్ రోహన్ బోపన్న జోడీ క్వార్టర్స్‌లో నిష్ర్కమించింది. ఆడమ్ పావ్లాసెక్(చెక్ రిపబ్లిక్)-బెహర్(ఉరుగ్వే) జోడీ చేతిలో 3-6, 6-3, 10-8 తేడాతో బోపన్న ద్వయం పరాజయం పాలైంది. కాగా, బోపన్న జోడీ ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed