Asia Cup 2023: ఆసియా కప్ ముందు కొవిడ్ టెన్షన్.. ఇద్దరు శ్రీలంక క్రికెటర్లకు కొవిడ్ పాజిటివ్

by Vinod kumar |
Asia Cup 2023: ఆసియా కప్ ముందు కొవిడ్ టెన్షన్.. ఇద్దరు శ్రీలంక క్రికెటర్లకు కొవిడ్ పాజిటివ్
X

శ్రీలంక : ఆసియా కప్‌ ఇంకా నాలుగు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ సమయంలో కొవిడ్-19 ఆసియా దేశాలను కలవరపెడుతున్నది. శ్రీలంక జట్టులో ఇద్దరు క్రికెటర్లకు కరోనా వైరస్ సోకడమే అందుకు కారణం. బ్యాటర్ అవిష్క ఫెర్నాండో, వికెట్ కీపర్ కుశాల్ పెరీరాకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టీమ్ మేనేజ్‌మెంట్ వైద్య పరీక్షలు చేయించింది. టెస్టుల్లో వీళ్లిద్దరు కరోనా పాజిటివ్‌గా తేలారు. దాంతో, మిగతా ఆటగాళ్లకు వైరస్ సోకుండా శ్రీలంక టీమ్ మేనేజ్‌మెంట్ తగు చర్యలు చేపట్టింది. ఆసియా కప్‌కు ముందు జట్టులో ఇద్దరు కరోనా బారిన పడటంతో శ్రీలంకకు గట్టి షాక్ తగిలినట్టైంది.

ఆసియా దేశాల్లో ఆందోళన..

ఈ నెల 30 నుంచి ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో హైబ్రిడ్ మోడల్‌‌లో నిర్వహిస్తుండగా.. పాకిస్తాన్, శ్రీలంక వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే నిర్వహిస్తుండగా.. శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్ అన్ని మ్యాచ్‌‌లకు శ్రీలంకనే ఆతిథ్యమివ్వనుంది. అయితే, ఆసియా కప్‌లో ఎక్కువ మ్యాచ్‌లకు వేదిక కానున్న శ్రీలంక జట్టులోనే కరోనా వైరస్ వెలుగుచూడటంతో ఇతర జట్లలో ఆందోళన నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 తగ్గుముఖం పట్టింది. దాంతో కొంతకాలంగా క్రికెట్ మ్యాచ్‌లకు వైరస్ టెన్షన్ లేదు.

ఈ క్రమంలో ఆటగాళ్లకు కొన్ని సడలింపులు ఇచ్చారు. కరోనా బారిన పడినా మైదానంలో అడుగుపెట్టే వెసులుబాటు కూడా ఉన్నది. అయితే, ద్వైపాక్షిక సిరీస్‌ల వరకు కరోనా ఆందోళన తక్కువగానే ఉన్నప్పటికీ.. ఆరు దేశాలు పాల్గొనే ఆసియా కప్ వంటి టోర్నీల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వైరస్ వేగంగా ఇతర జట్ల ఆటగాళ్లకు వ్యాప్తి చెందే చాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. తద్వారా మ్యాచ్‌లకు ఆటంకం కలిగే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం టోర్నీపై పడకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisement

Next Story