బల్దియాలో చెత్త వసూళ్లు.. ఖజానాకు భారీ గండి

by Y.Nagarani |   ( Updated:2024-10-17 03:51:48.0  )
బల్దియాలో చెత్త వసూళ్లు.. ఖజానాకు భారీ గండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో జోరుగా చెత్త దందా సాగుతుంది. హైదరాబాద్‌ను చెత్త రహిత నగరంగా మార్చాలనే లక్ష్యంతో ఇంటింటి చెత్త సేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన బల్దియా బల్క్ గార్జేజ్‌ ను ఉత్పత్తి చేసే సంస్థలను గాలికొదిలేసింది. ఇంటింటి చెత్త సేకరణకుగాను ఆటో టిప్పర్ యజమానులు ఒక్కో ఇంటి నుంచి రూ.100 వసూలు చేస్తున్నారు. కానీ పెద్దపెద్ద హోటల్స్, ఇతర వాణిజ్య సంస్థల నుంచి చెత్తను సేకరించినందుకు వసూలు చేస్తున్న ఫీజు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరడంలేదు. దీంతో పాటు 14 ఏండ్ల క్రితం రాంకీ సంస్థతో జీహెచ్ఎంసీ చేసుకున్న ఒప్పందం ప్రకారం చెత్త సెకండరీ ట్రాన్స్ ఫోర్ట్, ప్రాసెసింగ్ కోసం ప్రతినెల రాంకీ సంస్థకు జీహెచ్ఎంసీ అక్షరాల రూ.10 కోట్లు చెల్లిస్తోంది. ఇటు రాంకీ సంస్థకు కోట్ల రూపాయలు చెల్లించడం, అటు బడా సంస్థలకు చెందిన చెత్త రుసుము ఖజానాకు చేరకపోవడంతో జీహెచ్ఎంసీ భారీగా నష్టపోవాల్సి వస్తోందని పలువురు అధికారులు చెబుతున్నారు.

8 వేల మెట్రిక్ టన్నులు..

జీహెచ్ఎంసీ పరిధి 625 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. సుమారు 30 లక్షల ఇండ్లు, కోటిన్నర జనాభా ఉందని అధికారుల అంచనా. రోజుకు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంటింటి చెత్తను సేకరించడానికి 5 వేల ఆటో టిప్పర్లు పనిచేస్తున్నాయి. ఈ టిప్పర్ యజమానులకు జీహెచ్ఎంసీ ఎలాంటి వేతనం ఇవ్వడంలేదని, ప్రతి ఇంటి నుంచి ఎంతో కొంత వసూలు చేసుకోవాలని జీహెచ్ఎంసీ మౌఖిక ఆదేశాలు జారీచేసింది. దీంతో మినిమం రూ.100, ఏరియాను బట్టి ఎక్కువ కూడా వసూలు చేస్తున్నారు.

రూ.200 కోట్ల దందా ఇలా..

జీహెచ్ఎంసీ పరిధిలో బడా హోటల్స్, వాణిజ్య సంస్థలు 200 లకుపైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో బల్క్ గార్జేజ్ ఉత్పత్తి చేసే సంస్థల నుంచి చెత్తకు సంబంధించిన ఫీజు వసూలు చేయాలని బల్దియా నిర్ణయించింది. కానీ ఆచరణకు నోచుకోలేదు. ముఖ్యంగా హోటల్స్‌కు సంబంధించిన చెత్తను సేకరించడానికి డిమాండ్ నెలకొంది. ఒక్కో వాణిజ్య సంస్థ, హోటల్ నుంచి చెత్త సేకరించినందుకు నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వసూలు లెక్కన ఏడాదికి సుమారు రూ.10 లక్షలు అవుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 200 లకుపైగా బడా హోటల్స్, వాణిజ్య సంస్థలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా ఏడాదికి రూ.200 కోట్ల చెత్త దందా సాగుతుందని ప్రచారం జరుగుతున్నది. వీటితో ప్రయివేటు ఆస్పత్రులకు సంబంధించిన మున్సిపల్ వేస్ట్‌ను సైతం సేకరిస్తున్నారు. అయితే స్వచ్ఛ ఆటో టిప్పర్‌కు హోటల్‌ను కేటాయింపు జోనల్ స్థాయిలో జరుగుతున్నది. ఒక్క హోటల్ కేటాయించినందుకుగాను జోనల్ స్థాయి ఉన్నతాధికారికి రూ.5లక్షలు సమర్పించుకోవాల్సిందేనని విమర్శలూ లేకపోలేదు. స్వచ్ఛ ఆటో టిప్పర్లకు హోటళ్ల కేటాయింపు విషయంలో ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ జోన్లలో గోడవలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. తమకే కావాలని పలువురు ఆటో టిప్పర్ల యజమానులు అధికారులపై రాజకీయ నాయకులతో ఒత్తిడి కూడా చేయించిన సంఘటనలు అనేకం.

రాంకీకి రూ.10 కోట్లు..

జీహెచ్ఎంసీ పరిధిలో రాంకీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇంటింటి నుంచి చెత్త సేకరణ, ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తరలింపు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలింపు, డంపింగ్ యార్డులో శాస్త్రీయంగా చెత్తను ప్రాసెసింగ్ చేయడం వంటి అంశాలు ఉన్నాయి. వీటిలో ఇంటింటి చెత్త సేకరణ, ట్రాన్స్‌ఫోర్ట్ బాధ్యతలను రాంకీకి అప్పగించలేదు. సెకండరీ ట్రాన్స్ పోర్ట్, సైంటిఫిక్ ప్రాసెసింగ్ చేసేనందుకుగాను ప్రతినెల రూ.10 కోట్ల వరకు రాంకీకి జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లిస్తున్నారు.

అప్పుల్లో జీహెచ్ఎంసీ..

నిధుల్లేక జీహెచ్ఎంసీ నీరిసించిపోయింది. అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే రూ.5,780 కోట్ల అప్పులు చేసింది. ఒక పక్క రావాల్సిన ఆదాయానికి అధికారులు గండికొడుతుంటే మరో పక్క ప్రయివేటు సంస్థలకు ఫీజుల పేరుతో కోట్ట రూపాయలు చెల్లిస్తున్నారు. దీంతోపాటు గ్రేటర్ పరిధిలో ఉత్పత్తి అవుతున్న చెత్తను కొనుగోలు చేయడానికి పలు సంస్థలు జీహెచ్ఎంసీ చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడంలేదనే విమర్శలొస్తున్నాయి. దీంతోపాటు బల్క్ గార్బేజ్ సంస్థల నుంచి ఫీజులు వసూలు చేస్తే బల్దియాకు రూ.100 కోట్లకు పైగానే ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశముందని పలువురు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed