మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదులు.. కేసీ వేణుగోపాల్ కు చేరిన పంచాయతీ

by Y.Nagarani |
మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదులు.. కేసీ వేణుగోపాల్ కు చేరిన పంచాయతీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఏఐసీసీ నేతల దగ్గరకు చేరింది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌ను, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి, దీనికి తోడు ఆమె వ్యవహార శైలిపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సొంత పార్టీ నేతలూ గుర్రుగా ఉన్నారు. ఇదే విషయాన్ని లేఖల ద్వారా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు రాతపూర్వకంగా కొందరు ఫిర్యాదు చేశారు. ఆయనతో భేటీకి టైమ్ దొరికితే ఢిల్లీకి వెళ్లి ఏకరువు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపదాస్ మున్షీ జోక్యం చేసుకున్నారు. అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న నేతలను పిలిపించుకుని మాట్లాడారు. మొత్తం వివరాలను తీసుకున్నారు. సమంత విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ గంటల వ్యవధిలోనే ఆమెతో మాట్లాడి బహిరంగ క్షమాపణ చెప్పించారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లా నేతల ఫిర్యాదుల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలపై దీపదాస్ ఫోకస్ పెట్టారు.

ఉమ్మడి వరంగల్ నుంచి ఫిర్యాదులు

ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ అజమాయిషీ చేస్తున్నారని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని, పార్టీ శ్రేణులు డీ మోరల్ అయ్యేలా వ్యవహరిస్తున్నారన్నది ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల ప్రధాన ఆరోపణ. పార్టీపరంగా ఆమె కుటుంబానిదే పైచేయి కావాలనే ఉద్దేశంతోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారని దీపా దాస్ మున్షీకి పలువురు మొరపెట్టుకున్నారు. శాసనసభా పక్ష నేతగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చెడ్డపేరు రావొద్దనే ఉద్దేశంతో ఇన్‌చార్జిగా దీపాదాస్ చొరవ తీసుకుని గ్రూపుల మధ్య విభేదాలను పరిష్కరించడంపై దృష్టి సారించారు. కొన్ని నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య అగాథం ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం సొంత పార్టీ నేతలకు, మంత్రి కొండా సురేఖకు మధ్య గ్యాప్ తలెత్తడం పార్టీకి తలనొప్పిగా మారింది. మంత్రిగా ఉన్నందునే ఆమె జిల్లాలోని ఎమ్మెల్యేలను లెక్కచేయడం లేదని తీవ్ర స్వరంతో ఇన్‌ ఛార్జికి వివరించారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. మంత్రివర్గం నుంచి ఆమెను తప్పించాలనే డిమాండ్‌ను దీపదాస్ నోటీసులోకి తీసుకెళ్లారు.

మనస్తాపం చెందుతున్నామన్న నేతలు

బీఆర్ఎస్ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారని, కానీ ఆమె వైఖరితో జిల్లాలో పది నెలల్లోనే పార్టీ కేడర్‌ డీ మోరల్ కావడం బాధాకరమన్నది ఎమ్మెల్యేల వాదన. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదు జిల్లాల డీసీసీ నేతలు మంత్రి కొండా సురేఖ తీరుతో మనస్తాపంతో ఉన్నారని ఆ జిల్లా సీనియర్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కాకపోతే, ఆమెను కట్టడి చేయకపోతే హై కమాండ్ దృష్టికి తీసుకువెళ్లక తప్పదనే అభిప్రాయంతో ఉన్నారు. ఒకరిద్దరి ఆవేదన ఇప్పటికే కేసీ వేణుగోపాల్ దృష్టికి వెళ్లిందని, ఆ విషయాలపై దీపదాస్ మున్షీ దగ్గర ఆరా తీసి సత్వరం పరిష్కరించాలనే బాధ్యతను అప్పజెప్పినట్లు ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె ధోరణి ఇదే తీరులో కొనసాగితే, పార్టీ నియంత్రించకుంటే, పరిస్థితిని చక్కదిద్దకపోతే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఒకలాగ ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో రకంగా ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయిలోనే ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు

పీసీసీ చీఫ్‌గా మహేశ్‌ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నందున ఆయన చొరవ తీసుకుని పరిష్కరిస్తారనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమైందని, అందుకే ఈ వ్యవహారంలో వారు వేలు పెట్టడంలేదని గుర్తుచేశారు. సమంత వ్యవహారంలో కొండా సురేఖ వ్యాఖ్యలు చేసినప్పుడే మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించాలంటూ విపక్షాల నేతలు డిమాండ్ చేశారు. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి వాటిని పట్టించుకోలేదు. ప్రతిపక్షాల డిమాండ్‌ అర్థరహితమని భావించడం ఒక పార్శ్వమైతే, ఆమె చేసిన కామెంట్లు వ్యక్తిగతమే తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదన్నది మరో అంశం. కానీ ఇప్పుడు ఆ జిల్లాకు చెందిన సొంత పార్టీ నేతలే ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఆమె వైఖరి చివరకు బీసీ వర్సెస్ నాన్-బీసీ షేప్ తీసుకున్నదని, ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్నది ఆ జిల్లా ఎమ్మెల్యేల ఆరోపణ. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఉన్న పార్టీ హైకమాండ్ ఇప్పుడు ఈ వ్యవహారాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేకపోవడంతో రాష్ట్ర స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పీసీసీ చీఫ్ బిజీబిజీ

పీసీసీ చీఫ్ పార్టీలో రాష్ట్ర కమిటీల మొదలు మండల స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, లోకల్‌గా వారికి పోటీచేసే అవకాశాలు కల్పించడం, వివిధ పదవులు ఆశించి భంగపడినవారి అసంతృప్తిని చల్లార్చి నామినేటెడ్ పోస్టుల్లో సర్దుబాటు చేయడం... ఇలాంటి అనేక అంశాల్లో బిజీగా ఉన్నారు. గాంధీ భవన్ వేదికగా పలు జిల్లాల నేతలతో సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కొండా సురేఖ వ్యవహారంపై ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లాస్థాయి లీడర్లే గుర్రుగా ఉండడంతో సంస్థాగతంగా చిక్కులను నివారించే దిశగా త్వరలో ఆయన కూడా సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించేలా దృష్టి పెట్టడం అనివార్యమైంది. పార్టీకి అందరూ కావాల్సినవారే కావడంతో సున్నితమైన ఈ వ్యవహారానికి ముగింపు పలకడం ఇన్‌చార్జిగా దీపాదాస్ మున్షీకి, పీసీసీ చీఫ్‌ గా మహేశ్‌కుమార్ గౌడ్‌కు తప్పడంలేదు.

Advertisement

Next Story

Most Viewed