ఇలా స్టే.. అలా డిస్మిస్..

by Sumithra |
ఇలా స్టే.. అలా డిస్మిస్..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు పాలకవర్గాలను నియమిస్తూ జారీ అయిన ఉత్తర్వుల మేరకు రెండు చోట్ల బుధవారం ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసుకున్నారు. నిర్మల్ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా సోమ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఈటల శ్రీనివాస్ సహా మరో 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా బుధవారమే సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సహా పాలకమండలి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా... ప్రభుత్వం నియమించిన చైర్మన్ అబ్దుల్ హాదీ బీసీ కాదని మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అని హై కోర్టులో కేసు దాఖలు చేశారు. మంగళవారం కేసు విచారణకు రాగా బుధవారానికి వాయిదా వేస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో బుధవారం ఉదయం జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం రద్దయింది.

వెనువెంటనే కేసు డిస్మిస్..

బుధవారం కేసు విచారణకు రాగా.. అబ్దుల్ హాదీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని ఆయన తరపు న్యాయవాది హై కోర్టులో ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు. ప్రభుత్వ న్యాయవాది సైతం తన వాదనలను వినిపించగా.. విచారించిన హై కోర్టు జస్టిస్ మాధవి లత కేసును డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నాటకీయ పరిణామాల నడుమ ప్రమాణ స్వీకారం..

సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు ముఖ్య అనుచరుడైన స్వర్ణ గ్రామానికి చెందిన మైనారిటీ నేత అబ్దుల్ హాదీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ సొంత కాంగ్రెస్ పార్టీకి చెందిన దశరథ రాజేశ్వర్, బొల్లోజి నర్సయ్యలు హై కోర్టును ఆశ్రయించారు. ఆయన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాదని మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని ఆయన నియామకాన్ని సవాలు చేశారు. దీంతో ఆయన నియామకం పై ప్రతిష్టంభన ఏర్పడింది. బుధవారం ఉదయం జరగాల్సిన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని హై కోర్టు ఆదేశాలతో అధికారులు వాయిదా వేశారు. కాగా బుధవారం మధ్యాహ్నం ఈ కేసు తిరిగి విచారణకు రాగా.. అబ్దుల్ హాది తరపు న్యాయవాది ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంటూ సంబంధిత ధ్రువీకరణ పత్రాలను హై కోర్టుకు సమర్పించారు.

వాదనల అనంతరం హై కోర్టు జస్టిస్ మాధవి లత కేసును విచారించి అబ్దుల్ హాది పై వేసిన కేసును డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. హై కోర్టు ఉత్తర్వుల మేరకు మార్కెటింగ్ శాఖ అధికారులు ఆగమేఘాల మీద సారంగాపూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గా అబ్దుల్ హాదీ, వైస్ చైర్మన్ గా శంకర్ రెడ్డి మరో 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. నాటకీయ పరిణామాల నడుమ జరిగిన సారంగాపూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. నిర్మల్ సారంగాపూర్ రెండు మార్కెట్ కమిటీల పాలకవర్గాలు కొలువు దీరడంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావు వర్గీయులు హర్షం వ్యక్తం అయింది.

Advertisement

Next Story

Most Viewed