- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడ్డగోలుగా మద్యం కల్తీ.. సిండికేట్ ముసుగులో అక్రమ తతంగం..
దిశ, నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. అసలు కన్నా కొసరు ఎక్కువ అన్న చందంగా ప్రతి బెల్ట్ షాపునకు చాపకింద నీరులా చేరుతోంది. మద్యం ఆరోగ్యానికి హానికరం అన్నమాట చాటున మద్యం ప్రియుల ఆరోగ్యాలకు మరింత చేటు అయ్యేలా మద్యం బ్రాండ్లలో స్పిరిట్ కలుపుతూ నయా దందాకు తెరలేపారు. డబ్బు అక్రమ సంపాదనే లక్ష్యంగా పావులు కదుపుతూ పావుశేరు సీసాలు మొదలు ఫుల్ బాటిళ్ల వరకు యథేచ్ఛగా మద్యాన్ని కల్తీ చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారన్న చర్చ డివిజన్ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
చాపకింద నీరులా కల్తీ మద్యం..
నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కల్తీ మద్యం దందా యథేచ్ఛగా నడుస్తోంది. గ్రామాలు, తండాల్లోని బెల్ట్ షాపుల్లో నిత్యం అన్నిరకాల మద్యం అందుబాటులో ఉంటోంది. పండుగలు, ఫంక్షన్స్ జరిగే సమయంలో మద్యం కల్తీ మరింత ఎక్కువ అవుతోందన్న విమర్శలు, అక్కడక్కడా మద్యం తేడాగా ఉందని మద్యం ప్రియులు గొడవలకు దిగుతున్న సందర్భాలు ఇటీవల కాలంలో డివిజన్‌లో మరింత ఎక్కువయ్యాయి. దీనికి తోడు నర్సంపేట పట్టణం మినహా సిండికేట్‌గా ఏర్పడిన సదరు వ్యక్తులు అక్రమంగా మద్యాన్ని పట్టణ కేంద్రాలకు దూరంగా ఉన్న పల్లెళ్లకు సైతం ఆటోలు, గూడ్స్ వాహనాల సాయంతో చేరుస్తుండడం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో కల్తీ మద్యం ఎక్కడ ఎలా జరుగుతుందన్న విషయం తెలియక అటు మద్యంప్రియులు, బెల్ట్ షాపు నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తరలింపు వ్యవస్థను ఆసరాగా చేసుకున్న కొందరు వ్యక్తులు మండలాల వారీగా కల్తీ మద్యం దందాను మూడు ఫుల్లులు ఆరు క్వార్టర్లుగా విచ్చలవిడిగా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
సీల్, క్యాప్ ఉన్నది ఉన్నట్లే.. !
మద్యం కల్తీకి సంబంధించి భౌతికంగా ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వారి పనితనానికి నిదర్శనంగా మారింది. ఇందుకోసం ఏండ్లుగా బార్, వైన్స్‌ల్లో పని చేసే అనుభవజ్ఞులైన వారిని ఈ అక్రమ దందాకు వాడుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాటిల్ సీల్, క్యాప్ ఓపెన్ చేసి మద్యం కల్తీ చేసిన అనంతరం యధావిధిగా మళ్లీ బిగిస్తున్నారు. ఈ పనికి గానూ రోజుకు రూ.10వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. అనంతరం అసలు మద్యం బాటిళ్ల మాదిరిగానే ఇవి మద్యం ప్రియుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.
షాడో ఎక్సైజ్ అధికారులు..
నర్సంపేట డివిజన్‌లోని పలు మండలాల్లో షాడో (నకిలీ) ఎక్సైజ్ అధికారులు తిరుగుతున్నారు. వైన్ షాపుల్లో కొనుగోలు చేయాల్సిన మద్యం బాటిళ్లను ప్రజల వద్దకు పాలలాగా పలు వాహనాల్లో డివిజన్ వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, తండాల్లోని బెల్టు షాపులకు సిండికేట్‌గా ఏర్పడి తరలిస్తున్నారు. ప్రతీ ఫుల్ బాటిల్‌ను రూ.40 నుంచి రూ.60 ఎక్కువ ధరకు వసూలు చేస్తూ బెల్ట్ షాపులకు చేరవేస్తున్న సంగతి విధితమే. అయితే సిండికేట్‌లో మద్యం కొనుగోలు చేయకుండా మద్యం అమ్మకాలు చేస్తున్న వారిని షాడో (నకిలీ) ఎక్సైజ్ అధికారులు అడ్డుకుంటున్న ఘటనలు కోకొల్లలు. ఇటీవల చెన్నారావుపేట మండలంలో జరిగిన సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
చిన్న బ్రాండ్‌లే లక్ష్యంగా కల్తీ..
మద్యం కల్తీకి సంబంధించి చిన్న బ్రాండ్లు, ఎక్కువ అమ్మకాలు జరిగే మద్యం బాటిళ్లను అక్రమార్కులు ఎంచుకుంటున్నారు. డివిజన్ వ్యాప్తంగా రాయల్ స్టాగ్, ఐబీ మొదలుకుని సిగ్నెచర్, బ్లెండర్స్ ప్రైడ్ వరకు కల్తీ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటి కల్తీకి ఎవరూ పెద్దగా ఫిర్యాదులు చేయరన్న ధైర్యంతో నిస్సిగ్గుగా కల్తీకి పాల్పడుతున్నారు. నిత్యం మద్యం సేవించే మందుబాబులు మద్యంలో తేడాను గమనించి సదరు బెల్ట్ షాపు నిర్వాహకులతో గొడవలకు దిగుతున్న సందర్భాలు అనేకం ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్నాయి.
ఆరోగ్యాలను హరిస్తున్న స్పిరిట్..
మద్యం బాటిళ్లలో జరుగుతున్న కల్తీ కారణంగా మద్యం ప్రియుల జేబులే కాకుండా ఆరోగ్యాలు సైతం గుల్లవుతున్నాయి. సాధారణంగా మద్యంలో ఉండే ఆల్కహాల్ శాతాన్ని బట్టి, తీసుకున్న మోతాదుకు బట్టి సదరు వ్యక్తి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అతిగా మద్యసేవనంతో అధిక రక్తపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. జీవితకాలం (ఆయుర్ధాయం) తగ్గడంతో పాటు ముందస్తు మరణాలకు కారణం అవుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ సహా కాలేయ, అన్నవాహిక క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్పిరిట్ వినియోగంతో ఈ తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం.
ఎక్సైజ్ శాఖ తీరు పై విమర్శలు..
నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కల్తీ మద్యం, సిండికేట్ వ్యవస్థ పై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎక్సైజ్ శాఖ విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల కేంద్రాల నుంచి బాహాటంగా వాహనాల్లో మద్యం తరలింపు చేస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిని గతేడాది హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో పట్టుకుని వారి పై మొదటిగా పీడీ కేసు సైతం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కల్తీ మద్యం వ్యవహారం ఎంత దారుణమైందో తెలియజేస్తోంది. రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్న వారి పై కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న విచ్చలవిడి మద్యం తరలింపు, కల్తీ మద్యం పై చర్యలు తీసుకోవాలని డివిజన్ ప్రజలు కోరుతున్నారు.